యాసంగిపైనే ఆశలు | - | Sakshi
Sakshi News home page

యాసంగిపైనే ఆశలు

Oct 1 2025 11:07 AM | Updated on Oct 1 2025 11:07 AM

యాసంగిపైనే ఆశలు

యాసంగిపైనే ఆశలు

సాగు అంచనా.. 4.12లక్షల ఎకరాలు

వానాకాలం పంటలకు అతివృష్టి దెబ్బ

రాబోయే యాసంగి సీజన్‌లో 4.12లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి రావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. వానాకాలంలో అతివృష్టి కారణంగా తీవ్రమైన పంట నష్టానికి గురైన రైతులు యాసంగిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్‌లోనైనా ఊరట పొందాలనే ఆశావహదృక్పథంతో ఉన్నారు.

– గజ్వేల్‌

యాసంగి సీజన్‌ సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మొత్తంగా 4.12లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వరి 3,64,823 ఎకరాల్లో, 31,416 ఎకరాల్లో మొక్కజొన్న, 12,609 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 455ఎకరాల్లో వేరుశనగ, 579ఎకరాల్లో శనగలు, 54ఎకరాల్లో పత్తి, 968ఎకరాల్లో స్వీట్‌కార్న్‌ సాగులోకి వచ్చే అవకాశం ఉంది. మిగతా విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. సాధారణంగా మొక్కజొన్న కోత తర్వాత దాని స్థానంలో అక్టోబర్‌ రెండో వారం నుంచి పొద్దు తిరుగుడు, శనగలు ఇతర ఆరుతడి పంటలు విత్తుతారు. గతంలో శనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు సబ్సిడీపై ఇచ్చేవారు. కానీ కొన్నేళ్లుగా సబ్సిడీ ఊసే లేకపోవడం వల్ల శనగ పంట సాగు భారీగా పడిపోయింది. ఇదిలావుంటే వానాకాలం సీజన్‌లో అతివృష్టి కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం సంభవించింది. ఈ కారణంగా పంటల్లో ఎదుగుదల లోపించి ఎక్కడికక్కడా తెగుళ్లు దాడి చేశాయి. ప్రస్తుతం ఈ పంటలను తొలగించి పొద్దు తిరుగుడు, శనగ ఇతర ఆరుతడి పంటలతో ఉపశమనం పొందాలనుకుంటున్నారు. కానీ విత్తన సబ్సిడీ లేకపోవడం కలవరపరుస్తోంది.

ఇతర పంటలదీ అదే పరిస్థితి...

మొక్కజొన్న 31,416వేల ఎకరాల వరకు సాగులోకి వచ్చే అవకాశం ఉండగా 4,200 క్వింటాళ్ల విత్తనం అవసరం. పొద్దు తిరుగుడు 12,609 ఎకరాల్లో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు 2,300 క్వింటాళ్ల విత్తనం, వేరుశనగ 579 ఎకరాల్లో సాగులోకి రానుండగా.. 100క్వింటాళ్లకుపైగా విత్తనం అవసరం ఉంటుంది.

యూరియా కొరత తీరేనా?

వానాకాలంలో యూరియా దొరక్క తీవ్ర పంట నష్టానికి గురైన రైతులు యాసంగి సీజన్‌లోనూ యూరియా తీరుతుందా లేదా? అనే ఆందోళనలో ఉన్నారు. యాసంగి సీజన్‌ పూర్తయ్యేంతవరకు సుమారుగా 25వేల మెట్రిక్‌ టన్నులకుపైగా యూరియా అవసరముంటుందని అంచనా. కానీ అవసరం మేరకు నిల్వలు వస్తాయా? అనేది అనుమానంగా ఉంది. ఈ పరిస్థితి వల్ల రైతులు పంటల సాగును తగ్గించుకునే అవకాశం కూడా ఉన్నది. ఈ విషయంలో వ్యవసాయశాఖ రైతుల్లో నమ్మకం పెంపొందిస్తే తప్పా పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. మరోవైపు నానో యూరియా వాడకం పెంచేలా ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలని కూడా భావిస్తున్నది. కానీ ఈ ప్రయత్నం ఏమేరక ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement