
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● పటిష్ట కార్యాచరణతో ముందుకు ● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, అదనపు డీసీపీ, డీపీఓలతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. మండల కేంద్రాలలో నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలు, విధులపై అధికారులకు సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు.
నిబంధనలు పాటించాలి...
ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది నిబంధనలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు 15 కమిటీలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ దేవకిదేవి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుషాల్కర్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా అధికారులు పాల్గొన్నారు.