
స్థానిక పోరు.. చర్చ జోరు
● ఆశావహుల్లో దడ ● మొదలైన ఎన్నికల సందడి ● రాజకీయ పార్టీలు ఫోకస్
రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపైనే జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఇటీవల పూర్తి చేయగా, ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అధికారికంగా రిజర్వేషన్లను ప్రకటించవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రిజర్వేషన్లను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో దడపుడుతోంది. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో స్థానికసమరంపై పల్లెల్లో సందడి మొదలైంది.
– సాక్షి, సిద్దిపేట
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. గ్రామాల్లో ఎక్కడ నలుగురు కలిసినా సర్పంచ్ రిజర్వేషన్ ఇది అయిందని.. ఎంపీటీసీ ఇలా అయిందని జోరుగా చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు రిజర్వేషన్లపై కుతూహలంగా, మరోవైపు ఆందోళనగా ఉన్నారు. మండల స్థాయి అధికారులను మచ్చిక చేసుకుని ఏ రిజర్వేషన్ ఎవరికి అయిందని తెలుసుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. ఎవరికి చెప్పవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలుండటంతో చెప్పే సహసం అధికారులు చేయడం లేదని తెలుస్తోంది. దీంతో నేతలే పోటీ చేసే స్థానానికి ఏ రిజర్వేషన్ వస్తుందోనని లెక్కలు వేసుకుంటున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయిస్తే కొత్తగా ఏ స్థానం ఎవరికి రిజర్వేషన్ అవుతుందోననే చర్చ కొనసాగుతుంది. ఇక బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలైతే మారే రిజర్వేషన్ల తీరుపై కూడా మాట్లాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగో మహిళలకు 50శాతం స్థానాలు కేటాయిస్తారు. అందుకే మహిళా స్థానాలు ఆయా పదవులకు రిజర్వ్ అయితే నాయకులు వారి సతీమణులు, తల్లులను కూడా బరిలో దించేందుకు సమాయత్తమవుతున్నారు.
రాజకీయ పార్టీల నజర్
ఇప్పటికే సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని ఆశిస్తున్న ఆశావహులు వివిధ రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయా పార్టీల నేతలను కలిసి అభ్యర్థిస్తున్నారు. పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్న వారు గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు, కుల పెద్దలు, యువజన, మహిళా సంఘాల నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. మరోవైపు పల్లెల్లో మరింత పట్టు సాధించేందుకు సర్పంచ్ ఎన్నికలు కీలకమని భావిస్తున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు ఎవరిని పోటీ చేయించాలి? ఎవరికి పట్టు ఎక్కువగా ఉంటుందని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభించాయి.
గ్రామ పంచాయతీలు: 508
వార్డులు: 4,508
ఎంపీటీసీలు: 230
జెడ్పీటీసీలు: 26
పల్లె ఓటర్లు మొత్తం: 6,55,958
మహిళలు: 3,34,186
పురుషులు: 3,21,766
ఇతరులు: 06