
ఎట్టకేలకు నిధులొచ్చే..
మున్సిపాలిటీలకు తీపి కబురు తీరనున్న ప్రధాన సమస్యలు దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలకు రూ.45 కోట్లు మంజూరు రోడ్లు, డ్రైనేజీలు, తదితర పనులకు వినియోగం
దుబ్బాక: నిధులు లేక సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మూడేళ్లుగా నిధుల జాడలేకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. తాజాగా నగర అభివృద్ధి నిధుల కింద జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.45 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేటీవ్ ప్రభుత్వ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీచేశారు. గత జులైలోనే ప్రభుత్వానికి నిధుల ప్రతిపాదనలను ఆయా మున్సిపల్ కమిషనర్లు నివేదించారు. ఈ మేరకు నగర అభివృద్ధి కింద నిధులు మంజూరు కావడంతో సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన సమస్యలపై దృష్టి
నిధులు లేక అధ్వానంగా తయారైన డ్రైనేజీలు, రోడ్లు, చెరువుకట్టల సుందరీకరణ, వరదనీరు మళ్లింపు, పార్కుల సుందరీకరణ, పారిశుద్ధ్యంతో పాటు పలు ప్రధాన సమస్యల పరిష్కారం కానున్నాయి. దుబ్బాక మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం కాలనీలో స్ట్రీట్ లైటింగ్, డ్రైనేజీలకు రూ.40 లక్షలు, పార్కుకు రూ.40 లక్షలు, వరద నీరు పోయే కాల్వల నిర్మాణానికి రూ.1.60 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే చేర్వాపూర్ అనంతమహాలక్ష్మి టెంపుల్ నుంచి మారెమ్మ దేవాలయం వరకు సీసీ, బీటీ రోడ్డు మరమ్మతులకు రూ.1.40 కోట్లు, దుబ్బాక పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.40 లక్షలు, జంక్షన్ నిర్మాణానికి రూ.40 లక్షలు, మున్సిపాల్టిలోని 20 వార్డులకు ఒక్కో వార్డుకు రూ.50 లక్షల చోప్పున పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయి.
సర్వత్రా హర్షాతిరేకాలు
దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.45 కోట్లు మంజూరు కావడంతో సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధికి మార్గం
దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి నగర అభివృద్ధి కింద రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో అభివృద్ధి పనులకు మోక్షం కలగనుంది. డ్రైనేజీలు, వరద నీటి కాలువలు, అసంపూర్తి, అధ్వాన రోడ్లు నిర్మాణం చేపడుతాం. చాలా సమస్యలు తీరే అవకాశం ఉంది.
– రమేశ్‌కుమార్,
దుబ్బాక మున్సిపల్ కమిషనర్
వివరాలు ఇలా..
మున్సిపాలిటీ వార్డులు జనాభా
దుబ్బాక 20 40,000
హుస్నాబాద్ 20 30,000
చేర్యాల 12 14,000