
క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎస్సీసెల్ నేత
మల్లు రవిని కలిసిన విజయ్‌కుమార్
గజ్వేల్: టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ బుధవారం హాజర య్యారు. ఆగస్టు 3న గజ్వేల్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ సమక్షంలో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి విజయ్‌కుమార్ డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే ఇటీవల నర్సారెడ్డి కమిటీ ఎదుట హాజరై తన వాదనను వినిపించారు. బుధవారం విజయ్‌కుమార్ సైతం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యుల ముందు హాజరై తన వాదన చెప్పుకున్నారు. ఆయనతోపాటు గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి తదితరులు ఉన్నారు. విజయ్‌కుమార్‌కు మద్దతుగా మహిళలు, నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌కు మద్దతుగా వారు ప్లకార్డులను ప్రదర్శించారు.