
బియ్యం నాసిరకం.. బువ్వ అదోరకం
● పాఠశాలలకు పురుగుల బియ్యం సరఫరా ● మెత్తటి అన్నంతో విద్యార్థుల అవస్థలు ● అధికారుల పర్యవేక్షణ లోపం ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
దుబ్బాకటౌన్: ప్రతీ పాఠశాలకు నాణ్యమైన సన్న బియ్యంతో విద్యార్థుల కడుపునింపుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ దుబ్బాకలోని పలు పాఠశాలల్లో మాత్రం ఆ పరిస్థితి కానరావడం లేదు. బియ్యం సంచి తెరిస్తే చాలు ముక్క వాసన, తెల్లపురుగులు, లక్క పురుగులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యం ఘనమైనప్పటికీ జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యమైన బియ్యం అందక కింది స్థాయి ఉద్యోగులు, భోజనం మింగుడు పడక విద్యార్థులు నానావస్థలు పడుతున్నారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
పురుగుల బియ్యం సరఫరా చేయడంతో వాటిని తొలగించడానికి వంట పని వారు సైతం నానా తంటాలు పడుతున్నారు. పాఠశాలలో ఓ గదిలో బియ్యం ఆరబెట్టి పురుగులు తొలగిస్తున్నారు. కానీ వారు ఎంత వరకు పురగులు తొలగిస్తున్నారనేదే సందేహించాల్సిన విషయం. పురుగులు పూర్తి స్థాయిలో తొలగించకుంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటని, వారి ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
అస్వస్థత బారిన విద్యార్థులు
నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రుల వాదన. దుబ్బాకలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నెం.1లో నిత్యం తెల్ల పురుగులు, మెత్తటి అన్నంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నాసిరకం మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని వారు కోరుతున్నారు.
బియ్యంలో పురుగులు
దుబ్బాక మండలంలో 57 పాఠశాలకు దాదాపు వంద క్వింటాళ్ల బియ్యం ప్రతీ నెల సరఫరా చేస్తున్నారు. ఇందులో అధిక శాతం పురుగుల బియ్యం ఉండటం గమనార్హం. ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
నాసిరకం బియ్యం సరఫరా కాకుండా చర్యలు చేపడతాం. దుబ్బాకలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నెం.1కు అందించే బియ్యం నాసిరకంగా ఉన్న విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే నాణ్యమైనవి అందించేలా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు భయాందోళనకు గురి కావద్దు.
–ప్రభుదాస్, ఎంఈఓ, దుబ్బాక
మెత్తటి ముద్దలాంటి అన్నం

బియ్యం నాసిరకం.. బువ్వ అదోరకం