
అభివృద్ధి శరవేగం
● బైరాన్‌పల్లి పోరాట పటిమ.. తెలంగాణ పోరాటానికి మార్గదర్శకం ● ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు కల్పించాం ● జిల్లాను ప్రగతి పథంలో నిలుపుదాం ● రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ● కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం
సంక్షేమానికి ప్రాధాన్యం
సాక్షి, సిద్దిపేట: ప్రజాపాలన ప్రభుత్వం.. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.5లక్షల నుంచి రూ. పది లక్షలు పెంచామన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. సెప్టెంబర్ 17న భారత దేశంలో తెలంగాణ హైదరాబాద్ విలీనమైన రోజు, ఈ విలీన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరుపుకొంటున్నామని తెలిపారు. బైరాన్‌పల్లి పోరాట పటిమ తెలంగాణ పోరాట స్ఫూర్తికి మార్గదర్శకమని కోనియాడారు.
అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా..
అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని మంత్రి తెలిపారు. రేషన్ కార్డు కోసం పదేళ్లుగా జనం నిరీక్షించారని, వారందరూ సన్న బియ్యం తినాలన్న ఉద్దేశ్యంతో కొత్త కార్డులు జారీచేశామన్నారు. రెవెన్యూ ప్రక్షాళన చేస్తూ భూ భారతిని తీసుకువచ్చామని గుర్తు చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ విద్యకు ప్రాధాన్యతను ఇస్తూ సమృద్ధిగా నిధులు కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు.
వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం..
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళల అభివృద్ధి కోసం ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ పంపులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణ, వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని మంత్రి వివరించారు. 65వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. హైదరాబాద్‌లో అమరవీరుల స్ఫూర్తిగా స్తూపం నిర్మిస్తున్నామని, ఇది భవిష్యత్ తరాలకు గుర్తుండే విధంగా రూపకల్పన చేస్తున్నామన్నారు. మొక్కలను నాటి ఆదర్శంగా నిలిచిన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సీపీ డాక్టర్ అనురాధ, అదనపు కలెక్టర్లు గరీమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా అఽధికారులు, నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధి శరవేగం