
ఆదిపితామహుడు విశ్వకర్మ
సిద్దిపేటరూరల్: కర్మయోగం, శిల్పకళ, యాంత్రిక విజ్ఞనానికి ఆదిపితామహుడు విశ్వకర్మ అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. బుధవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి మంత్రి పొన్నం, కలెక్టర్ హైమావతి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ మహర్షి నిర్మించిన అద్భుతాలను మనం శ్రుతి, స్మృతి, పురాణాల్లో తెలుసుకుంటామన్నారు. మన జీవనోపాధికి, సమాజ అభివృద్ధికి మూలా ధారం అయిన పనిముట్లను కూలీలు, శిల్పులు, ఇంజనీర్లు, కార్మికులు, కర్మకారులు అందరూ పూజిస్తారన్నారు. ప్రతి పని చిన్నది పెద్దది అని చూడకుండా, కష్టపడి, నిజాయితీతో పనిచేస్తేనే జీవితం సార్థకమవుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, సీపీ అనురాధ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.