
తెలంగాణ చరిత్ర ఘనం
అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్
సిద్దిపేటకమాన్: తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉందని సిద్దిపేట అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ అన్నారు. ప్రజాపాల న దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్
హుస్నాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. మోదీ జన్మదినం పురస్కరించుకొని పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, మండల అధ్యక్షుడు సంపత్ నాయక్ ఆధ్వర్యంలో వేర్వేరుగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించగా 103 మంది రక్త దానం చేశారు. విమోచన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు, రామ మందిరం నిర్మాణం, జఠిలమైన సమస్యలను మోదీ పరిష్కరించారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాం గోపాల్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.
దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో ఈ నెల 22 నుంచి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానిస్తూ బుధవారం పలువురి ప్రముఖులకు ఆలయ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తదితరులను హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానపత్రికలు ఇచ్చారు.
దరఖాస్తు చేసుకోండి
గజ్వేల్‌రూరల్: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సబ్జెక్ట్‌లో బోధించేందుకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం బుధవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో ఎస్సీ, ఎస్టీలు 50శాతం మార్కులతో, బీసీ, ఓసీలు 55శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నారు. అదే విధంగా యూజీసీ, నెట్, సెట్, పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో ఈనెల 18న ఉదయం కళాశాలలో జరిగే ఇంటర్వ్యూ(డెమో)కు హాజరు కావాలని సూచించారు.
శిక్షణ పొందుతున్న సర్వేయర్లు
హుస్నాబాద్‌రూరల్: పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో కొత్త సర్వేయర్లు భూముల కొలతలపై డిజిటల్ సర్వేలో శిక్షణ పొందుతున్నారు. వీరికి సర్వేయర్ లక్ష్మీనారాయణ మ్యాప్‌లు గీయడం, పాత రికార్డుల ప్రకారం కొలతలు వేయడంపై శిక్షణ ఇస్తున్నారు. సర్వేయర్లకు డిజిటల్ పరిజ్ఞానం కోసం కంప్యూటర్‌లో అవగాహన కల్పిస్తున్నారు.