
లబ్ధిదారులే ఆ ఇళ్లల్లో ఉండాలి
● కలెక్టర్ హైమావతి ● డబుల్‌బెడ్రూం ఇళ్లపై అధికారులతో సమీక్ష
సిద్దిపేటరూరల్: జిల్లాలోని డబుల్‌బెడ్రూం ఇళ్లలో ఎంపిక చేసిన లబ్ధిదారులే నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో డబుల్‌బెడ్రూం ఇళ్ల మంజూరు, లబ్ధిదారులకు అప్పగింత, ఇతర ప్రగతి పనులపై తహసీల్దార్, మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డబుల్‌బెడ్రూం ఇళ్లు మంజూరైనా లబ్ధిదారులకు అందించకపోవడం, కొన్ని అన్యాక్రాంతం కావడం వంటి ఘటనలు దృష్టికి వచ్చాయన్నారు. జిల్లాలో డబుల్‌బెడ్రూం ఇళ్లను వేరేవాళ్లు ఆక్రమించిన క్రమంలో వెంటనే అధికారులు క్షేత్రస్తాయిలో తనిఖీలు నిర్వహించి ఖాళీ చేయించి అర్హులకు అప్పగించాలన్నారు. మిగిలిన ఇళ్లను ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హతగల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి మిగిలిన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి
అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వెంటనే మానిటరింగ్ కమిటీలను నియమించాలని, నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు ప్రతి గ్రామంలో పర్యటించి నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీఓలు సదానందం, రామ్మూర్తి, చంద్రకళ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాతీయ పతాకం ఆవిష్కరణ
సిద్దిపేటజోన్: ప్రజాపాలన వేడుకల్లో భాగంగా బుధవారం జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ హైమావతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.