
రాష్ట్రపతి నిలయంలో ‘పూలే’ విద్యార్థుల ప్రదర్శన
వర్గల్(గజ్వేల్): సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం వర్గల్ పూలే గురుకుల డిగ్రీ కళాశాల బాలికలకు దక్కింది. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాధారాణి మార్గదర్శకంలో 22 మంది వలంటీర్ల బృందం రాష్ట్రపతి నిలయం చేరుకున్నారు. ‘తెలంగాణ ఉదయం’ పేరిట తెలంగాణ విమోచన పోరాట చరిత్ర ఘట్టాలను చాటుతూ 15 నిమిషాల నాటక ప్రదర్శనతో ఆహుతులను అలరింపజేశారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, మాడపాటి హన్మంతరావు, ఆరుట్ల కమలాదేవి తదితర పాత్రలతో విద్యార్థులు ఆకట్టుకుని ప్రశంసలు చూరగొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ప్రసిద్ధ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, రజాకార్ సినిమా నిర్మాత నరసింహరెడ్డి, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రమేశ్ విద్యార్థుల ప్రదర్శన తిలకించి అభినందించారు. జ్ఞాపికను అందించి సన్మానం చేశారు.