
స.హ.చట్టం..
రెవెన్యూ కేసులే అధికం
సమాచారం అరకొర.. రాష్ట్ర కమిషన్ వద్దకు బిరబిర
ఎవరికీ పట్టని చుట్టం
● సమాచార హక్కు చట్టం కింద సిద్దిపేట పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ఇంటి నిర్మాణాల గురించి డిసెంబర్ నెలలో మున్సిపాలిటీలో ప్రవీణ్ దరఖాస్తు చేశారు. మే నెల వరకు వేచి చూసినా అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. దీంతో సదరు దరఖాస్తు దారుడు అప్పీల్ కోసం రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించారు.
● జిల్లా వ్యాప్తంగా ఎన్ని క్రీడా ప్రాంగణాలు నిర్మించారు? ఎన్ని వినియోగంలో ఉన్నాయని సిద్దిపేటకు చెందిన వ్యక్తి ఆర్టీఐ కింద డీఆర్‌డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారం సరిగా లేదని రాష్ట్ర ఆర్టీఐ కమిషన్‌ను ఆశ్రయించారు.
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ సంస్థల్లో, పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనం పెంచడమే సమాచార హక్కు చట్టం లక్ష్యం. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా భారత పౌరసత్వం కలిగిన వ్యక్తులు అవసరమైన సమాచారాన్ని కోరవచ్చు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం అరకొరగా ఇవ్వడం, దరఖాస్తు చేసిన తర్వాత నిర్ణీత సమయం దాటినా సమాచారం ఇవ్వకపోవడంతో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌కు అప్పీల్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2022 నుంచి ఇప్పటి వరకు 137 మంది దరఖాస్తు దారులు అప్పిల్‌కు వెళ్లారు. దీంతో మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో అప్పీల్ కేసులు పరిష్కరించేందుకు సమాచార హక్కు కమిషనర్లు వస్తున్నారు.
కన్పించని బోర్డులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డులలో పౌర సమాచార అధికారి పేరు, ఫోన్ నంబర్ ముద్రించి ఉండాలని చట్టం చెప్తుంది. కానీ పలు కార్యాలయాల్లో నిబంధనలు అధికారులు ఉల్లంగిస్తున్నారు. అధికారులు బదిలీ అయినా పాత వారి పేర్లే దర్శనమిస్తున్నాయి.
నేడు ఆర్టీఐ కమిషనర్లు రాక
స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఐదుగురు కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మోహిసినా పర్వీన్, భూపాల్, వైష్ణవిలు మంగళవారం సిద్దిపేటకు రానున్నారు. పీఐఓ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)లు, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించనున్నారు.
పక్క ఫొటోలో కన్పిస్తున్నది మిషన్ భగీరథ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు లో భాగంగా ఏ అధికారిని సంప్రదించాలని తెలిపే బోర్డు. ఈ బోర్డులో ఉన్న అప్పీల్ అధికారి, ఈఈ గిరిధర్ గత నెల 31న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి బోర్డులో అధికారి పేరు మార్చలేదు. అలాగే ప్రత్యేకంగా బోర్డు కాకుండా వైట్ పేపర్‌లో ప్రింట్ తీసి అతికించడం గమనార్హం.
సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు దారుడు అడిగిన సమాచారాన్ని 30రోజుల్లోగా పీఐఓ సమాచారం ఇవ్వాలి. లేనిపక్షంలో దరఖాస్తు దారుడు మొదటి అప్పీల్ చేసుకోవచ్చు. 90 రోజుల్లోగా సమాచారం రాకుంటే రెండో అప్పీల్‌గా రాష్ట్ర సమచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. జిల్లా వ్యాప్తంగా 137 మంది రెండో అప్పీల్‌కు వెళ్లారు. అందులో రెవెన్యూ అప్పీల్ కేసులే అధికంగా ఉన్నాయి. రెవెన్యూకు సంబంధించనవి 88, ఆర్ ఆండ్ ఆర్‌కు 15, వ్యవసాయశాఖ 4, ట్రాన్స్‌పోర్టు 4, వైద్యారోగ్య శాఖ 2, విద్యుత్ శాఖ 2, ట్రైబల్ వెల్ఫేర్ 2, ఇతర శాఖలకు చెందినవి 20 కేసులున్నాయి.
జిల్లా వ్యాప్తంగా రెండో అప్పీల్‌లో 137 కేసులు
పలు కార్యాలయాల్లో కన్పించని బోర్డులు
నేడు జిల్లాకు సమాచార హక్కు కమిషనర్లు

స.హ.చట్టం..