
ముమ్మరంగా చేపట్టాలి
పారిశుద్ధ్యం పనులు
● కలెక్టర్ హైమావతి
● అధికారులతో సమావేశం
సిద్దిపేటరూరల్: జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్నందున పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలతో నేల చిత్తడిగా మారి, నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించేలా మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు.
● ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్త్ నారి స్వశక్తి అభియాన్ కార్యక్రమాన్ని సంక్షేమ శాఖ, డీఆర్డీఓ, విద్య తదితర శాఖల సమన్వయంతో ఆస్పత్రులలో నిర్వహించాలన్నారు. అన్ని వయస్సు బాలికలు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ ను ఆదేశించారు.
● స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా ఈనెల 17 నుంచి 2 వ తేదీ వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో శ్రమదానం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యర్థాలు తొలగింపు, పర్యావరణహితమైన పండుగల నిర్వహణకు చర్యలు చేపట్టాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య ను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.