
సుందరీకరణకు మంగళం
ఎనిమిది పనుల్లో మూడే పూర్తి
● రూ.2కోట్ల నిధుల్లో అరకొర వినియోగం ● మిగిలిన నిధులు ల్యాప్స్ ● తాజాగా రూ.15కోట్లతో ప్రతిపాదనలు
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుందరీకరణ పనులకు మంగళం పాడారు. పట్టణంలోని ఎనిమిది జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా.. కేవలం మూడింటిని మాత్రమే అభివృద్ధి చేసి చేతులు దులుపుకొన్నారు. రూ.2 కోట్ల నిధులు గతంలో విడుదల కాగా పావువంతుకుపైగా నిధులు ఖర్చుపెట్టి.. మిగిలిన నిధులు ల్యాప్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో రూ.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పనులకు ఆమోదం వస్తేనే పట్టణానికి కొత్త కళ రానుంది.
– గజ్వేల్
‘అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని’ అనే సామెత గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సరిగ్గా సరిపోతుంది. అభివృద్ధిలో ఆదర్శంగా కీర్తించిన ఈ మున్సిపాలిటీలో ప్రధాన పనులు పూర్తి చేయకపోవడంతో నిధులు సగంలోనే ల్యాప్స్ కావడం ఆందోళన కలిగిస్తోంది. మూడున్నరేళ్ల క్రితం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించారు. ఈ క్రమంలోనే పట్టణంలోని మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ద్వారా రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, పిడిచెడ్ రోడ్డు చౌరస్తా, అంబేడ్కర్ సర్కిల్, ఇందిరాపార్కు చౌరస్తా, జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తా, తూప్రాన్ రోడ్డులోని బాబుజగ్జీవన్‌రామ్ వై జంక్షన్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ వద్ద గల సర్కిల్, ముట్రాజ్‌పల్లి సర్కిళ్లను అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించారు. కానీ ఇందులో అంబేడ్కర్ చౌరస్తా, బాబూజగ్జీవన్‌రామ్ చౌరస్తా, ముట్రాజ్‌పల్లి చౌరస్తాలో మాత్రమే పనులను పూర్తి చేసి, మిగతా పనులను చేపట్టలేదు.
పట్టణంలో సుందరీకరణ పనులను పూర్తి చేయడమేకాకుండా, సెంట్రల్ లైటింగ్, హౌసింగ్ బోర్డు మైదానంలోని చిల్డ్రన్స్ పార్కు ఆధునీకరణ, డ్రైనేజీలు, వరద కాల్వ నిర్మాణానికి రూ.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.కోటి, చిల్డ్రన్స్ పార్కుకు రూ.కోటి, పట్టణంలోని ప్రధాన రహదారులపై పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.5కోట్లు, సుమారు మరో 10కోట్లకుపైగా సీసీ రోడ్లు, ఇతర పనులకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం వస్తేనే పట్టణానికి నయా లుక్ రానుంది. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను వివరణ కోరగా గతంలో ‘గడా’ ద్వారా వచ్చిన సుందరీకరణ నిధులు ల్యాప్స్ అయిన మాట వాస్తవమేనన్నారు. తాజాగా ఇటీవల రూ.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆమోదం రాగానే పనులు పూర్తి చేస్తామన్నారు.
ఎందుకీ పరిస్థితి?
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఈ మున్సిపాలిటీకి అడిగిందే తడవుగా నిధులు వచ్చాయి. కానీ నిధులను సకాలంలో వినియోగించి పట్టణ ప్రగతిని పరిగెత్తించడంలో మాజీ పాలకవర్గం పూర్తిగా విఫలమైంది. ప్రత్యేకించి పట్టణంలో సుందరీకరణ పనులు పూర్తి కాకపోవడానికి, సగంలోనే నిధులు ల్యాప్స్ కావడానికి పాలకవర్గంలోని విభేదాలే కారణంగా నిలిచాయి. ఇందిరాపార్కు చౌరస్తాతో ఇతర కూడలిల పనుల ప్రారంభానికి ప్రజాప్రతినిధులే అడ్డంకిగా మారారు.