
అర్జీలు సత్వరం పరిష్కరించండి
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల వినతులు పరిష్కారం అవుతున్నందునా ప్రజావాణిపై విశ్వాసం పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యలు, పలు సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 152 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయండి
పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు రశీదు పొందడం సమస్యగా మారింది. వినతిపత్రాన్ని అందించిన అనంతరం రశీదు కోసం కౌంటర్ ఒక్కటే ఉండడంతో తీవ్ర ఆలస్యమవుతుంది. గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. అధికారులు మరో కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని అర్జీదారులు కోరుతున్నారు.