
గజ్వేల్ మున్సిపాలిటీలోని లక్ష్మీప్రసన్న కాలనీలో అంతర్గత రోడ్డు దుస్థితి
మొక్కుబడిగా వంద రోజుల ప్రణాళిక
మున్సిపాలిటీలో ఎక్కడి పనులు అక్కడే
మెరుగుపడని పారిశుద్ధ్యం
అంతర్గత రోడ్లకు మరమ్మతులు కరువు
సాక్షి బృందం పరిశీలనలో వెలుగుచూసిన విషయాలు
మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్ ప్లాన్ మొక్కుబడిగా సాగింది. ప్రభుత్వం నుంచి కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు సైతం ప్రణాళిక అమలును మమ అనిపించారు. దీంతో ప్రగతి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పారిశుద్ధ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇళ్ల మధ్య, రోడ్లపైనే చెత్త దర్శనమిస్తోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. రెగ్యులర్‌గా చేపట్టే పనులను మాత్రం నిర్వహించడం గమనార్హం. జిల్లాలోని మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుపై ‘సాక్షి’ బృందం పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి.
అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్యం అధ్వానం
గజ్వేల్: మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మొదలుకొని భువన్ సర్వే, ట్రేడ్ లైసెన్స్‌లు, ఇళ్ల అసిస్‌మెంట్ల టార్గెట్లు, ఇంటి పన్నుల వసూళ్లు, ఇళ్ల అనుమతులు, నల్లా కనెక్షన్ల ఆన్‌లైన్ తదితర అంశాలవారీగా వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగానే 2,685 నల్లా కనెక్షన్లను ఆన్‌లైన్ చేశారు. 34 గృహలను వాణిజ్య గృహాలుగా మార్చారు. 486 ట్రేడ్ లైసెన్స్‌లు అందించారు. 37శిథిల ఇళ్లను గుర్తించి నోటీసులు ఇచ్చి, వీటిలో 19 ఇళ్లను కూల్చేశారు. కానీ పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్ల విషయంలో పరిస్థితి మారలేదు. ఇళ్ల మధ్యే చెత్తను పారబోస్తున్నారు. దీంతో దుర్గంధం వ్యాపిస్తోంది. అంతర్గత రోడ్లకు మరమ్మతులు కరువై నడవడానికి కూడా వీలు లేకుండా తయారయ్యాయి. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో తమ కృషిని కొనసాగించామని తెలిపారు.
తీరని మురుగు వ్యథ
సిద్దిపేటజోన్: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో వందరోజుల యాక్షన్ ప్రణాళిక మొక్కుబడిగా ముగిసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులను కేటాయించలేదు. అయినప్పటికీ మున్సిపల్ నిధులతో కొన్ని పనులను చేపట్టారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను వందరోజుల ప్రణాళికలలో బల్దియా ఆశించిన స్థాయిలో చేపట్టలేదు. భారీ వర్షాలు కురిస్తే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. అస్తవ్యస్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వల్ల మురుగు నీటి ఇబ్బందులు తప్పడంలేదు. ఇదే అంశంపై మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ మాట్లాడుతూ.. యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పట్టణంలో అనేక అంశాలపై దృష్టి సారించామని తెలిపారు.
నిధులు రాక.. పనులు చేపట్టక
దుబ్బాక: నిధులు లేక మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వంద రోజుల ప్రణాళికలో నిధుల జాడ లేకపోవడంతో కొత్తగా పలాన పని అయిందన్న దాఖలాలు కనిపించలేదు. మున్సిపాలిటీలో సరిపడే సిబ్బంది లేక పారిశుద్ధ్య నిర్వాహణ అంతంత మాత్రంగానే తయారైంది. నిధులు లేకపోవడంతో కేవలం రెగ్యులర్‌గా నిర్వహించే శానిటేషన్, ట్రేడ్ లెసెన్స్‌లు, నల్లా కనెక్షన్ల ఆన్‌లైన్ తదితర పనులు మాత్రమే పూర్తిస్థాయిలో చేపట్టారు. అంతర్గత రోడ్లు, డ్రేనేజీలు అధ్వానంగా ఉండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.