
యూరియా పంపిణీలో సర్కార్ విఫలం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా సరఫరాపై ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టలేదన్నారు. జిల్లాల్లో ఎంత మంది రైతులు ఉన్నారు? ఎంత సాగవుతోంది? ఎంత యూరియా అవసరం? అనే వివరాలు తీసుకుని ప్రభుత్వానికి కలెక్టర్లు తెలపాలన్నారు. వివరాలు పూర్తిగా తెలిస్తే కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి యూరియా తీసుకువచ్చే బాధ్యత ఎంపీలదన్నారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద తమ తల్లి పేరున మొక్కను నాటి సంరక్షించాలన్నారు. స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ నివారణ, స్వదేశీ వస్తువుల వినియోగం, రక్తదానాలు, పేదలకు ఆహార పదార్థాలు అందించడం లాంటి కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలు చేపట్టాలన్నారు. జీఎ స్టీపై ఈ నెల 12 న గజ్వేల్, 13న సిద్దిపేటలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, మార్కండేయులు, తదితరులు పాల్గొన్నారు.
అలసి.. కునుకు తీసి
జగదేవ్‌పూర్(గజ్వేల్): జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద బుధవారం యూరియా కోసం రైతులకు బారులు తీరారు. ఉదయమే వివిధ గ్రామాల రైతులు రైతు వేదికకు వచ్చి వేచి చూశారు. రాళ్లు, చెప్పులు, పాస్ పుస్తకాలు క్యూలో పెట్టారు. ఓ గ్రామానికి చెందిన వృద్ధ రైతు అలసి పోయి అక్కడే కొంతసేపు కునుకు తీశారు. ఏఓ వసంతరావు మాట్లాడుతూ మండలానికి 15 వందల బస్తాలు వచ్చాయని వరుస క్రమంలో యూరియాను అందించినట్లు తెలిపారు.
సహకార సంఘం ఎదుట బారులు
మద్దూరు(హుస్నాబాద్): యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం ధూళ్మిట్ట మండల కేంద్రంలో ఉదయం నుంచి సహకార సంఘం వద్ద రైతులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. వారం రోజులుగా ఒక్క సంచి దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్లు ఒక చోట యూరియా మరో చోట ఇవ్వడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు.
రైతులు అధైర్యపడొద్దు..
అందరికీ అందిస్తాం
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

యూరియా పంపిణీలో సర్కార్ విఫలం

యూరియా పంపిణీలో సర్కార్ విఫలం