
పర్యావరణ హితమే లక్ష్యం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
గజ్వేల్: పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గజ్వేల్‌లోని పత్తి మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిని గౌరవించుకోవడంతోపాటు భావితరాల బాగు కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నదన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, సూపర్‌వైజర్ మహిపాల్, నాయకులు పాల్గొన్నారు.
చేప పిల్లల పంపిణీలో
సర్కార్ విఫలం
సిద్దిపేటజోన్: ఉచిత చేప పిల్లల పంపిణీలో సర్కార్ విఫలమైందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేసిందని, ముదిరాజ్‌లకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత ఏడాది టెండర్ల పేరిట కాలయాపన చేసిన ప్రభుత్వం ఈసారి అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. చేప పిల్లలను వదిలే సీజన్ దాటినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేప పిల్లలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వెంకటేశం, యాదగిరి, ఎల్లం, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ నాయకుల
వినూత్న నిరసన
సిద్దిపేటజోన్: విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. స్థానిక సుభాష్ రోడ్ మార్గంలో దుకాణాలలో నాయకులు భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్స్, స్కాలర్ షిప్‌లను సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరశురాం, అరవింద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుకు పడిన గండి పూడ్చివేత
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం ఖాజీపూర్ రోడ్డు ఇటీవల కురిసి వర్షాలకు గండి పడింది. 15 రోజులుగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో రుద్రారం గ్రామానికి చెందిన సామాజిక సంఘ సేవకుడు మల్లన్నగారి భిక్షపతి ప్రత్యేక చొరవతో మంగళవారం జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి గండిని పూడ్చివేశారు. దీంతో రెండు గ్రామాలకు రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

పర్యావరణ హితమే లక్ష్యం

పర్యావరణ హితమే లక్ష్యం

పర్యావరణ హితమే లక్ష్యం