
వనం..
ఒకే రోజు 15,292 మొక్కలు నాటిన అధికారులు వనమహోత్సవంలో నంబర్ వన్‌గా నిలిచిన జిల్లా
సాక్షి, సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఒక్కో మొక్కను నాటి ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మంగళవారం ‘ఏక్ పేడ్ మా కే నామ్ (తల్లి పేరు మీద) స్ఫూర్తితో కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా 15,292 మొక్కలు నాటారు. ఇందులో అటెండర్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఉద్యోగులు ర్యాలీగా వచ్చి మొక్కలు నాటే వినూత్న కార్యక్రమం చేపట్టారు. మొక్కను నాటి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలలో షేర్ చేశారు. అలాగే నాటిన మొక్కలకు జీయో ట్యాగ్ చేసి ఏక్ పేడ్ మా కే నామ్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని, అందుకే తల్లి పేరుపై మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యత చూసుకోవాలన్నారు.
రాష్ట్రంలోనే నంబర్ వన్
వన మహోత్సవం కార్యక్రమంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా జిల్లా నిలిచింది. 2025–26కుగాను 18.02కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 13.14కోట్ల(72.89శాతం) మొక్కలను నాటారు. అందులో జిల్లా లక్ష్యం 22.47లక్షలు కాగా 23.32 లక్షల (103.79 శాతం) మొక్కలు నాటి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.