
దఫ్తర్‌లోనే బిస్తర్!
ఆయన జిల్లా స్థాయి అధికారి. అధికారం, దర్పం, ఆర్థిక వెసులుబాటులన్నీ ఉన్నాయి. దర్జాగా ఉండాల్సిన ఆ అధికారి ఎందుకో దైన్యంగా ఉంటున్నాడు. సమీకృత కలెక్టరేట్ రెండవ అంతస్తులోని తన కార్యాలయంలో మకాం పెట్టాడు. వికారాబాద్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన సదరు అధికారి.. ఆగస్టు ఒకటిన బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దఫ్తర్‌లోనే అన్నీ కానిచ్చేస్తున్నాడు. ఉతికిన బట్టలను ఆరబెడుతున్నాడు. కార్యాలయానికి వచ్చిన ప్రజలు చూసి ఔరా.. ఇదేమిటని ముక్కున వేలేసుకుంటున్నారు.
కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో మకాం
● ఫైళ్లు ఉండాల్సిన బీరువాలో అధికారి బట్టలు
● ఉతికిన బట్టలను కుర్చీలపై ఆరబెట్టిన వైనం
● అధికారి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు
సాక్షి, సిద్దిపేట: జిల్లా కలెక్టరేట్‌లోని బీరువాలలో ఆఫీసు ఫైళ్లు ఉండాల్సింది పోయి బట్టలు, చాప, దుప్పట్లు దర్శనమిస్తున్నాయి. కార్యాలయంలోనే సదరు అధికారి సిగరెట్లు తాగుతుండటంతో దుర్వాసనకు ముక్కు మూసుకోవాల్సి వస్తుందని సిబ్బంది, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అధికారికి హోదాకు తగ్గట్టు ఇంటి అద్దెను వేతనంలో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ అలవెన్స్ ఖర్చులు మిగిలించుకోవడం కోసం ఇలా కక్కుర్తిపడటం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.