
పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయితీ అధికారి(డీపీఓ) దేవకీ దేవి హెచ్చరించారు. ‘మంచం పట్టిన తండా.. ఇంటింటా జ్వరపీడితులే..’ అనే శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి ఆమెతోపాటు జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ స్పందించారు. ఈ సందర్భంగా మండలంలోని మైసమ్మవాగుతండాలో వైద్యాధికారి వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంటింటా జ్వర సర్వే చేసి దాదాపు 100 మందికి జ్వరం టాబ్లెట్లు అందజేశారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆరుగురికి రక్తపరీక్షలు చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ ధన్‌రాజ్ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. డీపీఓ దేవకీ దేవి మాట్లాడారు. మారుమూల పల్లెలు, తండాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేక దృష్టిసారించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆమె స్వయంగా తండాలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి తాగునీటిని పరిశీలించారు. వీధుల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ డీఈ రుహిన తస్కిన్, ఆరోగ్య డిప్యూటీ డిఎంహెచ్‌ఓ ఆనంద్, ఎంపీడీఓ జయరాం, ఎంపీఓ మోహన్‌నాయక్, హెల్త్ అసిస్టెంట్ కొమురయ్య, ఏఎన్‌ఎం సునీత, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
డీపీఓ దేవకీదేవి

పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు