
అదను దాటితే అంతే సంగతులు!
ఎదిగే సమయంలో తీవ్రమైన కొరత అతివృష్టితో దెబ్బతిన్న పంటలు రికవరీ చేసుకునే అవకాశం కరువు వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం సిద్దిపేట జిల్లాలో పరిస్థితిపై ‘సాక్షి’ పరిశీలన
యూరియా లేక.. పంటలు డీలా
గజ్వేల్: యూరియా కొరత తీవ్ర పంట నష్టాన్ని కలిగిస్తున్నది. ఎదుగుదల లోపించడం, తెగుళ్లు వ్యాపించడంతో ఇప్పటికే వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు అతివృష్టి వల్ల నీట మునిగిన పంటలను రికవరీ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కొన్ని చోట్ల రైతులు ఇప్పటికే వానాకాలం పంటలపై ఆశలు వదులున్నారు. సిద్దిపేట జిల్లాలో పంటల పరిస్థితిపై ‘సాక్షి’ పరిశీలన జరిపింది. జిల్లాలో 4.87లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 3.40లక్షల ఎకరాలు, మొక్కజొన్న 27,820, ఎకరాలు, కంది 6594 ఎకరాల్లో సాగులోకి రాగా పత్తి 1.06లక్షల ఎకరాలపైగా సాగులోకి వచ్చింది. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వచ్చాయి. కానీ ఈసారి యూరియా కొరత రైతులను కుంగదీస్తున్నది. వానాకాలం సీజన్ మొత్తానికి 40వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇప్పటివరకు కేవలం 28,882 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పంటలు ఎదిగే కీలకమైన సమయంలో యూరియా ఒక్క బస్తా దొరకడం గగనమవుతుండగా..రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
వేలాది ఎకరాల్లో పంట నష్టం
పంటలు ఎదిగే సమయంలో యూరియా దొరక్క వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మరోవైపు భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను రికవరీ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రత్యేకించి వరికి తీవ్ర నష్టం కలిగింది. జిల్లాలోని చాలా చోట్ల వరద ఉధృతికి వరి ఇసుక మేట వేసి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లోతట్టు చేలల్లో పత్తి నీటి మునిగి రంగుమారుతోంది. మరోవైపు వేరుకుళ్లు ఇతర తెగుళ్లు విజృంభించాయి. దీనివల్ల దిగుబడి భారీగా పడిపోయే దుస్థితి నెలకొన్నది. కొన్ని చోట్ల రైతులకు పెట్టుబడి కూడా దక్కని స్థితిలో పంటలు ఉన్నాయి. మొక్కజొన్న పంటకు సైతం భారీ నష్టం జరిగింది. అతివృష్టి వల్ల జిల్లాలో 7759 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పూర్తిస్థాయి అంచనా కోసం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. ఇకపోతే అదనుకు యూరియా వేయపోవడం వల్ల జిల్లావ్యాప్తంగా వరి సుమారుగా 20వేల ఎకరాలకుపైగా పత్తి 10వేల ఎకరాలు, మొక్కజొన్న 4వేల ఎకరాలకుపైగా దెబ్బతిన్నట్లు అంచనా.
యూరియా దొరక్క వరి దెబ్బతింది
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేసిన. ఎన్ని రోజుల నుంచి తిరుగుతుండగా, మూడు బస్తాల యూరియా దొరికింది. ఇది ఏ మూలకు సరిపోలేదు. దీనివల్ల పంట ఎదుగుతలేదు. ఇప్పటికై నా యూరియా అందకపోతే పంట మీద ఆశలు చాలించుకోవాల్సిందే.
రైతు లచ్చిరెడ్డి, తీగుల్, జగదేవ్‌పూర్ మండలం

అదను దాటితే అంతే సంగతులు!

అదను దాటితే అంతే సంగతులు!