ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

Sep 8 2025 9:41 AM | Updated on Sep 8 2025 9:41 AM

ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

మద్యం మహమ్మారి, రైతు ఆత్మహత్యలపై పోరాటాలు అభినందనీయం

గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌ రజతోత్సవంలో

మాజీ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌రూరల్‌: తెలంగాణ ఉద్యమంలో ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి కీలకపాత్ర పోషించే విధంగా కృషి చేయడంలో గజ్వేల్‌ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, మద్యం మహమ్మారి, రైతు ఆత్మహత్యలపై పోరాటాలు అభినందనీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌ రజతోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోని ఎస్‌ఎల్‌ఎన్‌ కన్వెన్షన్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన సావనీర్‌ ‘కలం పోరు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ..కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల కోసం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లతోపాటు గ్రామీణ ప్రాంత విలేకరులకు బస్‌పాసులు అందించామన్నారు. రిటైర్డ్‌ జర్నలిస్టుల కోసం ఈహెచ్‌ఎస్‌ ఏర్పాటుకు అసెంబ్లీలో చర్చిస్తామని హామీనిచ్చారు.

గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌కు ప్రత్యేక స్థానం: శ్రీనివాస్‌రెడ్డి

తెలంగాణ ప్రాంతంలో గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌కు ప్రత్యేక స్థానముందని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయగా సంబంధిత శాఖ అధికారులను పిలిచి వారంలోగా సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు.

మంచి చేయాలన్నవారే

జర్నలిస్టులుగా రావాలి: కొత్త ప్రభాకర్‌రెడ్డి

గ్రామాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా జర్నలిస్టుల దృష్టికి తీసుకువెళితే ఆ సమస్య వేగంగా పరిష్కారమయ్యేదనే నమ్మకముండేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. యూట్యూబ్‌ చానల్‌, సోషల్‌ మీడియా రావడంతో నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి మంచి చేయాలన్నవారే జర్నలిస్టులుగా రావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డాక్టర్‌ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, మాజీ ఫుడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, బేవరేజస్‌ మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీ ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌అలీ, జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్‌, లోక్‌సత్తా తెలుగు ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement