
కరెంట్.. కట్‌కట
● వ్యవసాయానికి వేళాపాళా లేని విద్యుత్తు కోతలు ● రోజుకు 10 గంటలు కూడా సరఫరా కాని దుస్థితి
కొండపాక(గజ్వేల్): కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లో వ్యవసాయ రంగానికి వేళాపాళా లేని విద్యుత్తు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు రాజ్యమంటూ గొప్పలు చెపుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ రైతుల సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఓ పక్క యూరియా కొరత వేధిస్తుండగా మరో పక్క వ్యవసాయ బావులకు త్రీ ఫేజ్ విద్యుత్తు కోతలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. త్రీ ఫేజ్ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకపోతుండటంతో రాత్రింబవళ్లూ వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ప్రారంభంలో 12 నుంచి 15గంటలు సరఫరా
వర్షాకాలం వ్యవసాయ సాగు పనులు ప్రారంభంలో ప్రతీ రోజు 12 నుంచి 15 గంటల వరకు త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా జరిగేది. అయితే ఆలస్యంగా వర్షాలు కురవడంతో రెండు మండలాల్లో 3నుంచి 4 గ్రామాల్లో మినహా మిగతా గ్రామాల్లోని చెరువులు నిండటంతో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో ఆలస్యంగా వరి నాట్లు వేశారు. కొండపాక మండలంలో సుమారు 20 వేల ఎకరాల్లో, కుకునూరుపల్లి మండలంలో 8 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కొండపాక మండలంలో 7,452 అధికారిక వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లుండగా, కుకునూరుపల్లి మండలంలో 3,510 వ్యవసాయ అధికారిక విద్యుత్తు కనెక్షన్లుండగా మరికొన్ని అనధికారిక విద్యుత్తు కనెక్షన్ల ద్వారా త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా జరుగుతోంది. ఇందుకుగాను దుద్దెడ, కొండపాక, మర్పడ్గ, బందారం, వెలికట్ట, తిమ్మారెడ్డిపల్లి, మేదినీపూర్, తిప్పారం గ్రామాల్లోని 32/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్ల నుంచి వ్యవసాయ బావులకు విద్యుత్తు సరఫరా జరుగుతోంది.
ప్రచారార్భాటం పటాటోపమే
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిమిషమైనా కరెంటు కోతలుండవంటూ ప్రచారం చేసి తీరా అధికారంలోకి రాగానే కరెంటు సరఫరా తీరులను పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో వ్యవయసాయ రంగానికి రోజుకు 18 నుంచి 20 గంటల వరకు సరఫ రా జరగ్గా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 8 నుంచి 10 గంటల విద్యుత్తు సరఫరా కూడా కావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. విద్యుత్తు శాఖ గజ్వేల్ డీఈ భానుప్రకాశ్‌ను వివరణ కోరగా త్రీ ఫేజ్ విద్యుత్తు సరపరాలో కోతల విషయమై నిర్ధారించడం లేదు.
పొట్ట దశకు చేరుకున్న వరిపంటలు
వర్షాకాలం ప్రారంభ దశలో సాగు చేసిన పంటలు చిరు పొట్ట దశకు చేరుకున్నాయి. ఈ దశలో నీటి వినియోగం ఎక్కువగా అవసరపడుతుందని సమయంలో వేళాపాళాలేని విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 4 గంటలకు నిలిచిపోయిన త్రీ ఫేజ్ కరెంటు మధ్యరాత్రి సుమారు 2 నుంచి 3 గంటలకు సరఫరా అవుతుందన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రి పూట వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కరెంట్.. కట్‌కట