
టీచర్ కావాలనుకొని లీడరయ్యా
● ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది ● బడిబాటతో సత్ఫలితాలు ● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ● విద్యతోనే వికాసం: కలెక్టర్
సిద్దిపేటజోన్: ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని, తనకు చిన్నతనంలోనే టీచర్ కావాలనే బలమైన కోరిక ఉండేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. శనివారం స్థానిక టీటీసీ భవన్‌లో జరిగిన గురుపూజోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ అయి రాజకీయాల్లోకి వచ్చాక తనకు టీచర్ అయ్యే అవకాశం వచ్చిందని, అనివార్య కారణాల వల్ల కాలేకపోయానని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు రూ 23కోట్ల సంబంధించి నిధులు విడుదల కాలేదన్నారు. రూ.100 కోట్లు మన ఊరు, మన బడి బకాయిలు ఉన్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి మూలాలు విద్యా వ్యవస్థలో ఉన్నాయని పేర్కొన్నారు. నూతన విద్యా సూచనలు పాటిస్తూ కొత్త కొత్త విషయాలు బోధించి పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కోమరయ్యలు, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.