
రోడ్లు ధ్వంసం
19.64
దెబ్బతిన్న కల్వర్టులు, వంతెనలు
● రూ.33 కోట్ల నిధులు అవసరం ● ప్రతిపాదనలు పంపిన అధికారులు
సిద్దిపేట అర్బన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల తాత్కాలికంగా రాకపోకలు సాగించేలా మరమ్మతులు చేశారు. జిల్లాలోని సిద్దిపేట ఆర్‌అండ్‌బీ ఈఈ పరిధిలో 25 ప్రాంతాలలో 18.80 కి.మీ మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దీనిలో ఇప్పటి వరకు 10 కి.మీ రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. తొమ్మిది ప్రాంతాలలో రోడ్డుపై నుంచి వరద నీరు వచ్చే ప్రాంతాలను గుర్తించారు. దెబ్బతిన్న రోడ్లు, ఓవర్ ఫ్లో అయ్యే రోడ్ల మరమ్మతులకు రూ.1.55 కోట్లు అవసరం అవుతాయని అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. అలాగే గజ్వేల్ ఆర్‌అండ్‌బీ ఈఈ పరిధిలో 29 ప్రాంతాలలో 0.84 కి.మీ మేర రోడ్లు దెబ్బతినగా.. 26 ప్రాంతాలలో ఓవర్‌ఫ్లో అవుతున్నట్టు గుర్తించారు. వీటి మరమ్మతుల కోసం రూ. 1.71 కోట్లు అవసరం అవుతాయని నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా 54 ప్రాంతాలలో 19.64 కి.మీ మేర రోడ్లు దెబ్బతినగా.. తాత్కాలిక మరమ్మతుల కోసం 3.26 కోట్లు అవసరం అవుతాయని, శాశ్వత మరమ్మతుల కోసం రూ.29.82 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపారు. పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్ శాఖ పరిధిలో సిద్దిపేట ఈఈ పరిధిలో 5 చోట్ల, గజ్వేల్ ఈఈ పరిధిలో 2 చోట్ల వంతెనలు దెబ్బతినగా మరమ్మతులకు అవసరమైన నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా వంతెనలు నిర్మించడానికి దాదాపు రూ. 3 కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
ప్రతిపాదనలు పంపాం
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పలు ప్రాంతాలలో రోడ్లు కొంత వరకు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల తాత్కాలికంగా రాకపోకలు సాగించేలా మరమ్మతులు చేయించాం. మళ్లీ దెబ్బతినకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు అవసరమైన నిధుల కోసం అంచనాలు రూపొందించి పై అధికారులకు ప్రతిపాదనలు పంపాం.
–సారంగపాణి, ఎస్‌ఈ

రోడ్లు ధ్వంసం