
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
కొండపాక(గజ్వేల్): పరిసరాల పరిశుభ్రతలతోనే వ్యాధులను దూరం చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ గరీమా ఆగర్వాల్ అన్నారు. మండలంలోని దుద్దెడలో పంచాయతీ సిబ్బంది, అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంట్లో వాడుకునే నీటిని పరిశీలించారు. కొందరి ఇళ్లల్లో నీరు ఎక్కువ రోజులుగా నిల్వ ఉండటాన్ని గుర్తించి బయట పడేయిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గరీమా అగర్వాల్ మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించవద్దన్నారు. సంపులు, నీటి తొట్టిల్లో మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజుల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వారం రోజులకోమారు మురికి కాలువలను శుభ్రం చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి దేవకీదేవి, మండల ప్రత్యేకాధికారి నాగరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ మల్లికార్జున్, ఏఎంపీ డైరెక్టరు కొమ్ము మల్లికార్జున్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.