
మాట్లాడుతున్న సీపీఐ నేత అశోక్
జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ
చిన్నకోడూరు(సిద్దిపేట): తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ అన్నారు. బుధవారం మండల పరిధిలోని రామంచ మధిర దాసరివాడలో మంత్రి హరీశ్‌రావుకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నేతల మాయమాటలు నమ్మ వద్దన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఎలా మారిందో రాకముందు ఎలా ఉండేనో కళ్లెదుట కనబడుతోందన్నారు. హరీశ్‌రావుకు భారీ మెజార్టీని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ సంతోషి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
నేటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం నుంచి సిటీపోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ శ్వేత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహించరాదని సీపీ సూచించారు. సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు కూడా కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.
భైతి దుర్గయ్యకు
బాల సాహిత్య పురస్కారం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి, బాలసాహితీ వేత్త భైతి దుర్గయ్యకు బాల సాహిత్య వికాస పురస్కారం వరించింది. ఈమేరకు బుధవారం బాలసాహితీ వేత్త ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ బాల సాహిత్యంలో విశిష్ట సేవ చేసినందుకు తెలుగు సాహిత్య కళా పీఠం ఈ పురస్కారం ప్రకటించిందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని రవీ ంద్ర భారతిలో నిర్వహించే సమావేశంలో పురస్కారం స్వీకరించనున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన బాల సాహిత్య రచయితలు, ఉపాధ్యాయులు దుర్గయ్యను అభినందించారు.
హామీలను
విస్మరించిన బీఆర్‌ఎస్
చేర్యాల(సిద్దిపేట): గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్‌ఎస్‌ను ఓడించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు గ్రామాలకు వస్తున్న బీఆర్‌ఎస్ నాయకులను నిలదీయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడమే ప్రభుత్వ అసమర్థత పాలనకు నిదర్శనమన్నారు. రైతు రుణమాఫీ, పేదలకు ఇళ్లు, స్థలాలు, కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్ల మంజూరు తదితర విషయాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అలాగే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రకటన చేయకుండా అన్యాయం చేసిందన్నారు. సమావేశంలో నాయకులు ఈరి భూమయ్య, కుడికాల బాల్‌మోహన్, జి.యాదగిరి, వలబోజు నర్సింహాచారి, పోలోజు నర్సయ్య పాల్గొన్నారు.
నేడు న్యాయ విజ్ఞాన సదస్సు
సిద్దిపేటకమాన్: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సదస్సు జరుగుతుందని లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

దాసరివాడలో ఏకగ్రీవ తీర్మానం చేస్తున్న గ్రామస్తులు

