● త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా షురూ
● యజమాని మరణిస్తే రూ.5 లక్షలు
● త్వరలో మార్గదర్శకాలు
నారాయణఖేడ్: పేదలకు ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకంతో ధీమా కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటనతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా రైతు కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు 2018లో రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు గల రైతులను పథకంలో చేర్చించి. కుటుంబ పెద్ద మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందజేసింది. ఈ పథకంతో అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలు కావడం లేదు. ఈక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతులతో పాటు ఇతర వర్గాల వారికి పథకం మరింత చేరువ కానుంది. జిల్లాలో ఆహార భద్రతా కార్డులు 4,21,692 ఉండగా, అంత్యోదయ కార్డులు 26,664, అన్నపూర్ణ కార్డులు 90 ఉన్నాయి. పై కార్డుదారులందరూ పేద వర్గాలకు చెందిన వారే.
కుటుంబానికి రూ.5 లక్షలు
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిచడమే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రధాన ఉద్దేశం. కుటుంబ పెద్ద మరణించిన సందర్భాల్లో ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకం ద్వారా రూ.5 లక్షల బీమా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇది వరకే ఇంటింటి సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం పేద వర్గాల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రేషన్‌కార్డుదారులు, సర్వే వివరాల ఆధారంగా పేద వర్గాలను అంచనా వేయనున్నారు.
పేద వర్గాలకు మేలు
ప్రభుత్వం ప్రకటించిన పథకానికి సంబంధించి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. లబ్ధిదారుడు ఎలాంటి డబ్బులు చెల్లించ కుండానే బీమా ప్రీమియం ప్రభుత్వమే భరించే విధానం ప్రతిపాదించారు. కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే పథకం ఉద్దేశం. రేషన్‌కార్డు, ఆధార్, గుర్తింపు వివరాలు, కుటుంబ సభ్యుల సంబంధ ధ్రువీకరణ తదితర వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కుటుంబ పెద్ద మరణించిన పక్షంలో మరణ ధ్రువీకరణ పత్రం, అవసరమైతే పోలీసు కేసు, పోస్టుమార్టం వివరాలు కూడా కొన్ని సందర్భాల్లో సేకరించే అవకాశం ఉంది. మొత్తంమీద పథకం అమలు జరిగితే పేద వర్గాలకు ఎంతో ఉపశమనంగా మారనుంది.


