టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల చేపట్టిన దీక్ష గురువారం రెండో రోజూ కొనసాగింది. ఈసందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాహుల్ ఉద్యమం కొనసాగినంత కాలం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లోనూ సంగారెడ్డి నియోజకవర్గంలో సంఘీభావ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. జగ్గారెడ్డి దంపతుల దీక్షకు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జగ్గారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి
నారాయణఖేడ్: ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్‌షెట్కార్ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకగాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు నల్లదుస్తులు ధరించి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజీవ్‌చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ‘సర్’ పేరిట లక్షలాది ఓట్లను కుట్ర పూర్వకంగా తొలగిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా మారిందన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్, కౌన్సిలర్లు, మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
జహీరాబాద్: రైతులు వ్యవసాయ సంబంధిత రాయితీలు, పథకాలు, ఎరువులు పొందాలంటే రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోహీర్ ఏఓ నవీన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డుతో లింక్ కలిగి ఉన్న ఫోన్ నంబర్‌తో సంప్రదించాలని సూచించారు. రైతులు మీ సేవ కేంద్రాలు, రైతు వేదికల్లో ఏఈఓల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.


