జిల్లా వైద్యారోగ్య బదిలీ శాఖ | - | Sakshi
Sakshi News home page

జిల్లా వైద్యారోగ్య బదిలీ శాఖ

May 31 2026 12:04 PM | Updated on May 31 2026 12:04 PM

రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు ప్రాతినిధ్యంవహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ సొంత జిల్లాలో డీఎంహెచ్‌ఓ (జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి) పోస్టు నియామకం తరచూ చర్చనీయాంశంగా మారుతోంది. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.వసంత్‌రావును ఆకస్మికంగా బదిలీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు రావడం..ఆయన స్థానంలో డాక్టర్‌ కె.లలితాదేవికి పోస్టింగ్‌ ఇవ్వడం..ఆమె శనివారమే ఆగమేఘాలపై జిల్లాకు వచ్చి బాధ్యతలు తీసుకోవడం..ఇలా 24 గంటల్లోనే నిర్ణయాల అమలు చకచకా జరిగిపోవడం జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేపింది.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా డీఎంహెచ్‌ఓగా నియమితులైన లలితాదేవి చార్మినార్‌ జోన్‌ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్నారు. మరోవైపు వసంతరావుకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన్ను ఆశాఖ డైరెక్టరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వసంతరావు 2025 నవంబర్‌ 14న డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు తీసుకోగా ఏడు నెలల్లోనే ఆయన్ను మార్చుతూ ఆదేశాలు రావడం గమనార్హం.

నాలుగు నెలలకే నాగనిర్మల మార్పు..

డీఎంహెచ్‌ఓ పోస్టు నియామాకం ప్రతీసారి ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. గతంలో డీఎంహెచ్‌ఓగా నియమితులైన డాక్టర్‌ కె.నాగనిర్మలను కూడా ఐదు నెలల్లోనే మార్చేశారు. నాగనిర్మల 2025 జూలై 26 డీఎంహెచ్‌ఓ (ఇన్‌చార్జి)గా బాధ్యతలు అప్పగిస్తూ వైద్యారోగ్యశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాదాపు నాలుగు నెలల్లోనే ఆమెను ఈ పోస్టు నుంచి తొలగించారు. ఆమె స్థానంలో వసంతరావును నియమిస్తూ 2025 నవంబర్‌ 13న ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలా నాలుగు నెలల్లోనే నాగనిర్మలను తొలగించగా..ఇప్పుడు వసంతరావును కూడా ఆరు నెలల్లోనే మార్చడం జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ శాఖలో కొన్ని ఉద్యోగాల నియామకాల విషయమే నాగనిర్మల మార్పునకు దారితీసిందనే చర్చ అప్పట్లో జరిగింది.

2021 నుంచి ఇన్‌చార్జి పాలనే..

జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పోస్టులో గత ఐదారేళ్లుగా ఇన్‌చార్జి పాలనే కొనసాగింది. 2021లో మోజీరాం రాథోడ్‌ తర్వాత డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ కొన్ని రోజులే ఇన్‌చార్జిగా పనిచేశారు. తర్వాత 2021 మార్చి 30న డాక్టర్‌ గాయత్రీదేవి ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె 2025 జూలై 25 వరకు దాదాపు ఐదేళ్లుగా ఇన్‌చార్జిగానే కొనసాగారు. ఆ తర్వాత రెగ్యులర్‌ అధికారులు నియమితులైనప్పటికీ వారు తరచూ మారుతుండటంతో ఆ శాఖలో పాలన ప్రశ్నార్థకంగా మారింది.

డిజిటల్‌ హెల్త్‌ ఫ్రొఫైల్‌ పైలెట్‌ ప్రాజెక్టే కారణమా?

వసంతరావుకు ఆకస్మిక బదిలీ వెనుక కారణాలేంటనే అంశంపై ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టును జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. రోగుల సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసే ఈ ప్రక్రియ మంత్రి సొంత జిల్లాలోనే నత్తనడకన సాగుతోంది. వసంతరావు బదిలీ వెనుక ఇది కూడా ఓ కారణమై ఉండవచ్చని వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు వైద్యరోగ్యశాఖ ఉన్నతాధికారులు జిల్లా పర్యటన సందర్భంగా వసంతరావు సెలవుపై వెళ్లిపోవడం కూడా ఆయన ఆకస్మిక బదిలీకి దారి తీసిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద వైద్యారోగ్యశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర సొంత జిల్లాలో సొంత శాఖలో అధికారుల తరచూ మార్పులు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

ఏడు నెలల్లోనే డీఎంహెచ్‌ఓ వసంతరావుకు స్థానచలనం

అంతకుముందు

నాగనిర్మలకు నాలుగు నెలల్లోనే..

హెల్త్‌ మినిస్టర్‌ సొంత జిల్లాలో

డీఎంహెచ్‌ఓ పోస్టింగ్‌ల తీరిది

అధికార వర్గాల్లో సర్వత్రా చర్చ

Advertisement
 
Advertisement
Advertisement