సింగూరు భూ కబ్జాపై విచారణ | - | Sakshi
Sakshi News home page

సింగూరు భూ కబ్జాపై విచారణ

May 31 2026 12:04 PM | Updated on May 31 2026 12:04 PM

వట్‌పల్లి(అందోల్‌): సింగూర్‌ ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతంలోని వందల ఎకరాల భూమిని ఆక్రమించి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారని, దీనిపై విచారణ చేపట్టి సింగూరు భూములను కాపాడాలని అందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని ఖాదిరాబాద్‌ గ్రామ శివారులో సింగూరు భూములు కబ్జాకు గురైనట్లు తెలుసుకున్న ఆయన శనివారం అక్కడికి చేరుకుని బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి సింగూరు ముంపు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగూరు ప్రాజెక్ట్‌ మరమ్మతుల కోసం నీటిని ఖాళీ చేయడాన్ని ఆసరగా చేసుకుని మంత్రి దామోదర బావమరిది ముంపు ప్రాంతంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పటికే ఖాదిరాబాద్‌, సాయిపేట గ్రామాల శివారులో 70 ఎకరాల భూమి కలిగిన మంత్రి బావమరిది టూరిజం, రిసార్ట్‌, బోటింగ్‌ వ్యాపారం పేరిట ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వచ్చే భూములను యంత్రాలతో చదును చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు మంత్రి బావమరిది తన ఫాంహౌస్‌ నుంచి లోపలికి కిలోమీటర్‌ దూరం వరకు బండరాళ్లతో నింపి, దానిపై మట్టితో అక్రమంగా రోడ్డు వేస్తున్నారన్నారు. ఈ క్రమంలో కోరివికుంట, నల్లకుంట చెరువుల కట్టలను పూర్తిగా తవ్వేశారని తెలిపారు. విద్యుత్‌శాఖ అనుమతి లేకుండానే ముంపు ప్రాంతంలో కిలోమీటరు మేర విద్యుత్‌లైన్లు వేశారన్నారు. ప్రాజెక్టులో గుడి కడతామనే నెపంతో అక్కడ జెండాలు పాతి, భవిష్యత్తులో ఈ కబ్జాను క్రమబద్దీకరించుకునేందుకు కుట్రలు చేస్తున్నా స్థానిక అధికారులు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని తక్షణమే రెవెన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌శాఖ అధికారులతో ఉమ్మడి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అందోల్‌ మాజీ ఎమ్మెల్యే

చంటి క్రాంతికిరణ్‌ డిమాండ్‌

వందల ఎకరాల భూ కబ్జాకు

మంత్రి దామోదర్‌ బావమరిది యత్నం!

Advertisement
 
Advertisement
Advertisement