● రాత్రికి రాత్రే క్వింటాళ్ల కొద్దీ ధాన్యం మాయం ● ఆందోళన చెందుతున్న రైతులు
వట్‌పల్లి(అందోల్): పంట కోతలు పూర్తవడంతో రైతులు రోడ్డు, రహదారుల వెంట పెద్ద ఎత్తున ఆరబెట్టిన ధాన్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. నిత్యం ఎవరో ఒకరి ధాన్యం ఎత్తుకెళ్లిన ఘటనలు చోటుచేసుకోవడం పట్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
వరుస చోరీలతో బెంబేలు
అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామంలో సాగైన మొక్కజొన్న, వరి పంటలను నాందేడ్ జాతీయ రహదారి వెంట పెద్ద ఎత్తున కుప్పలుగా పోసి ఆరబెట్టిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురి రైతులకు చెందిన ధాన్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. గ్రామానికి చెందిన కాడెం మొగులయ్య అనే రైతు వద్ద సంచులలో నింపిన 15 బ్యాగుల మొక్కజొన్న బ్యాగులను వెత్తుకెళ్లారు. మండలంలోని డాకూర్‌లో 20 సంచులు, మాసాన్‌పల్లి గ్రామంలో 15 సంచుల వరి ధాన్యం బ్యాగులను ఎత్తుకెళ్లిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
పెట్రోలింగ్ నిర్వహించాలి
దొంగలు క్వింటాళ్ల కొద్దీ ధాన్యం ఎత్తుకెళ్లడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం ఎత్తుకెళ్తుండటంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. పోలీసు అధికారులు రాత్రి వేళల్లో గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.
8.5 క్వింటాళ్ల ధాన్యం ఎత్తుకెళ్లారు
మొక్కజొన్న పంటను కోసి ధాన్యాన్ని రహదారి పక్కన ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రానికి తరలించే క్రమంలో ఈనెల 9న సంచులలో నింపి ఉంచి రాత్రి 11 గంటల వరకు అక్కడే కాపలా ఉన్నాను. ఉదయం చూసేసరికి 15 సంచుల ధాన్యం ఎత్తుకెళ్లిపోయారు. వెంటనే హైవే అధికారుల ద్వారా సీసీ ఫుటేజీ పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో రూ.21 వేలు నష్టపోయాను.
కాడెం మొగులయ్య,రైతు,కన్‌సాన్‌పల్లి


