సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో జనగణన– హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చకచకా సాగుతోంది. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాకు (హెచ్‌ఎల్‌బీ)ల్లో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. సరిహద్దులను గూగుల్ మ్యాప్‌తో అనుసంధానించారు. కొన్ని చోట్ల ఈ బ్లాకుల సరిహద్దుల విషయంలో ఎన్యుమరేటర్లు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ సమస్య తలెత్తిన చోట్ల ఆయా మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్లు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా సరిహద్దులను గుర్తించారు. మండుతున్న ఎండలతో ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరగడంలో అవస్థలు పడుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికి తిరిగి సెన్సెస్ నంబర్లు (సీఎన్) వేస్తున్నారు. ఈ ప్రక్రియ బుధవారంతో ముగుస్తుంది. ఈ నంబర్లు అన్నీ వేశాక బ్లాకుల మ్యాపులను తయారు చేస్తారు. తర్వాత ఎన్యుమరేటర్లు మరోసారి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు.
గ్రామాల నుంచి వచ్చి
పట్టణాల్లో ఉంటున్న వారు..
జిల్లాలో చాలా మంది గ్రామాల నుంచి సమీప పట్టణాలకు వచ్చి నివాసం ఉంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేందుకు పట్టణాల్లో ఉంటున్న వీరిలో కొందరు పట్టణాల్లో తమ వివరాలను నమోదు చేసుకుంటుంటే.. మరికొందరు గ్రామాల్లో నమోదు చేసుకుంటామని చెబుతున్నారని ఎన్యుమరేటర్లు పేర్కొంటున్నారు.
జిల్లాలో 2,480 బ్లాకులు
హౌస్ లిస్టింగ్ కోసం జిల్లాను మొత్తం 2,562 బ్లాకులుగా విభజించారు. ఇందులో 11 మున్సిపాలిటీల పరిధిలో 798 బ్లాకులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 1,764 బ్లాకు ఉన్నాయి. మొత్తం 2,428 మంది ఎన్యుమరేటర్లు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇందులో పది శాతం మందిని రిజర్వుగా ఉంచారు. ఉపాధ్యాయులనే ఎక్కువగా ఎన్యుమరేటర్లుగా నియమించారు. ఈ జనగణన ప్రక్రియను విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, ఈ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పలుమార్లు శిక్షణ ఇచ్చింది. మాస్టర్ ట్రైనర్లు శ్రీకాంత్‌గౌడ్, అమరేందర్‌రెడ్డిలు ఎన్యుమరేటర్లకు వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. ఈ జనగణనపై జిల్లా వాసుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నుంచి ఐబీ చౌరస్తా వరకు మారథాన్ వాక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జనగణనకు జిల్లా వాసులు సహకరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ పిలుపునిచ్చారు.
12 వేల మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్
హౌస్ లిస్టింగ్ ఎన్యుమరేషన్‌ను సొంతంగా సెల్‌ఫోన్లలో కూడా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. జిల్లాలో 12,212 మంది పౌరులు తమ నివాసాలకు సంబంధించిన ఎన్యుమరేషన్‌ను సొంతంగా చేసుకున్నారు. ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ వివరాలను సక్సెస్ ఫుల్‌గా నమోదు చేసుకున్నారు. మరో 1,742 మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోసం వివరాలను నమోదు చేసుకున్నప్పటికీ.. ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో కంప్లీట్ చేయలేకపోయారు.
నేటితో నమోదు ప్రక్రియ పూర్తి
సరిహద్దుల గుర్తింపులో
కొంత ఇబ్బందులు
మున్సిపల్ వార్డు ఆఫీసర్ల ద్వారా
సమస్యకు పరిష్కారం
సొంతూర్లో నమోదుచేసుకుంటామంటున్న
కొందరు పట్టణవాసులు


