● వారి రాకతో ఊపందుకున్న
ధాన్యం కొనుగోళ్లు
● ఒక్క హత్నూర మండలంలోనే
600 మంది కూలీలు
హత్నూర(సంగారెడ్డి): ప్రతి పనికి బిహారీ కూలీలే దిక్కవుతున్నారు. వారు లేకుంటే ఏ పనీ ముందుకు సాగడం లేదు. కొంతకాలంగా బిహారీ కూలీలు లేక ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగిన విషయం తెలిసిందే. హత్నూర మండలంలో 20 ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16 సొసైటీ కేంద్రాలను ప్రారంభించారు. వీటిని తూకం వేసేందుకు 600 మందికి పైగా హమాలీల అవసరం ఉంది. కానీ స్థానికంగా కూలీల కొరత వల్ల కొనుగోళ్లు ముందుకు రాకపోవడంతో బిహారీ కూలీలే పెద్ద దిక్కు అయ్యారు. హత్నూర మండలంలో బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన హమాలీ కూలీలు రావడంతో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. క్వింటాలుకు రూ.48 హమాలీ చెల్లిస్తున్నప్పటికీ వీటిలో గుత్తేదారు సగం తీసుకుంటున్నారని తెలిసింది. కూలీలకు మాత్రం సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, నెల రోజులకుపైగా హమాలీ కూలీలుగా పనిచేసి రూ.30 నుంచి 40 వేల వరకు డబ్బులు సంపాదించుకుంటామని కూలీలు పేర్కొన్నారు.


