ఉమ్మడి జిల్లాలో రూ.32 కోట్ల మేర నష్టాలు
మెదక్ కలెక్టరేట్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సంస్థ లాస్‌లో నడుస్తోంది. గత ఫిబ్రవరి వరకు రూ.32 కోట్ల మేర నష్టాల్లో ఉంది. సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్ డిపోల పరిధిలో నష్టం అత్యధికంగా ఉంది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఏడాదికి రూ. 300 కో ట్లు కేంద్ర ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నప్పటికీ గట్టెక్కడం లేదు. ప్రతి కిలోమీటర్‌కు రూ.62 రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 57.52 మాత్రమే వస్తున్నాయి. అలాగే డ్రైవర్లు, కండక్టర్లు సరిపోను లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. ఫలితంగా వారు సెలవులు పెడుతున్నారు. దీంతో కొన్ని రూట్లలో బస్సులను నడపడం లేదు. ఆదా యం వచ్చే మార్గాలపైన అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో సంస్థకు నష్టాలు వస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆర్టీసీ సంస్థ లాస్‌లో నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట కలిపి మొత్తం 9 డిపోలు ఉన్నాయి.
సమ్మర్ టూర్లు.. తీర్థయాత్రలు
ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికత కోసం టూర్లకు వెళ్తుంటారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సైతం సమ్మర్ టూర్‌లో మెదక్ జిల్లాలోని ఏడుపాయల, ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్‌ఐ చర్చి, పోచారం అభయారణ్యం లాంటి ప్రదేశాలు చూపించాలని భావిస్తున్నారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది సైతం ఈ ప్రణాళిక కొనసాగింది. ఈ ఏడాది సైతం అరుణాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ, రామప్ప ఆలయం తదితర ఆలయాలకు సమ్మర్‌లో ప్రత్యేక ప్యాకేజీలతో సిద్ధం చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా..
డిపోలు 9
బస్సులు 627
డ్రైవర్లు 764
కండక్టర్లు 1,014
ప్రత్యేక ప్రణాళికలు
ఆర్టీసీ సంస్థను లాభాల బాట పట్టించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించాం. సంస్థకు ఆదాయం సమకూర్చే విధంగా పనిచేయాలని పలు సలహాలు, సూచనలు ఇచ్చాం. వివాహాలు, శుభకార్యాలకు, టూర్లు, పుణ్యక్షేత్రాలకు బస్సులను అద్దెకు ఇస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం.
– విజయభాస్కర్, రీజినల్ మేనేజర్
రెండు డిపోల పరిధిలో అత్యధికం
అధికారుల దిద్దు‘బాట’


