● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ప్రజావాణిలో 137 అర్జీలు
సంగారెడ్డి జోన్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌కు అర్జీలు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్‌లో అందోల్, సంగారెడ్డి, డివిజన్లకు సంబంధించి ప్రజావాణి నిర్వహించారు. నారాయణఖేడ్, జహీరాబాద్, డివిజన్ కేంద్రాలలో ప్రజావాణి నిర్వహించి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 137 అర్జీలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రజలు తమ డివిజన్ కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవాలని సూచించారు. సంబంధిత పోర్టల్‌లో అప్ లోడ్ చేసి 30 రోజుల్లోపు సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాండు, మాధురి, తదితరులు పాల్గొన్నారు. కాగా, కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు అందించేందుకు బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండి అధికారులకు అర్జీలను అందించారు.
ప్రజావాణికి విశేష స్పందన
నారాయణఖేడ్: సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మొదటిసారి ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. సబ్ కలెక్టర్ ఉమాహారతి వినతులను స్వీకరించారు. దివ్యాంగుడైన తనకు స్వయం ఉపాధికోసం వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా రుణం ఇప్పించాలని మండలంలోని జుజాల్‌పూర్‌కు చెందిన మంజూర్ అహ్మద్ వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలను పాతపద్ధతిలోనే ఇవ్వాలని ఏఐఎస్‌ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్ వినతిపత్రం అందజేశారు. మరో 12 మంది భూసమస్యలు, పెన్షన్లు ఇతర పౌరసేవలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని సబ్ కలెక్టర్ తెలిపారు.


