మున్సిపాలిటీలో స్వయంగాసమస్యలను తెలుసుకుంటా అభివృద్ధి పనులకు నిధులనుమంజూరు చేస్తా మంత్రి దామోదర హామీ మంత్రిని కలిసిన మున్సిపల్‌పాలకవర్గ సభ్యులు
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీకి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సంగారెడ్డిలోని మంత్రి స్వగృహంలో కలిశారు. వారితో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. నెలలో ఒక వారం పర్యటించేలా ప్రణాళికను తయారు చేసుకుంటానని చెప్పారు. పట్టణంలో 500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌ను మంత్రి ప్రశ్నించగా.. 230 ఆన్‌లైన్ అయ్యాయని, మరో 140 ఆన్‌లైన్ సమస్యలు ఉన్నాయని కమిషనర్ వివరించారు. అజ్జమర్రి–జోగిపేట బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించాలని, ఈ పనులు పూర్తయినట్లయితే సుమారుగా 23 గ్రామాల ప్రజలు జోగిపేటకు వివిధ పనుల నిమిత్తం వచ్చే అవకాశం ఉంటుందని దీనివల్ల వ్యాపారాలు పెరిగి, స్థానిక వ్యాపారులకు జీవనోపాధి లభించనుందని మంత్రి తెలిపారు.
సీల్డ్‌కవర్‌లోనే కోఆప్షన్ సభ్యుల పేర్లు
జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించి జరగబోయే మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి తాను సీల్డ్ కవర్‌ను పంపుతానని మంత్రి దామోదర పాలకవర్గ సభ్యులకు సూచించారు. తాను పంపిన పేర్లకు మీరంతా ఆమోదం తెలపాలని, అన్ని విధాలుగా ఆలోచించే కొత్త కోఆప్షన్ సభ్యుల పేర్లను నిర్ణయిస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబుతో పాటు కౌన్సిలర్లు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.


