చేతికి వచ్చిన పంట
● కొనుగోలు కేంద్రాలు లేక రైతుల అవస్థలు ● తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు ● మద్దతు ధర కోసం డిమాండ్
జహీరాబాద్ టౌన్: జొన్నల కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జొన్న పంట చేతికి వచ్చింది. కోతలు జోరుగా సాగుతున్నాయి. పంట ఆశాజనకంగా ఉండడంతో మంచి దిగుబడులు వస్తున్నాయి. అయితే.. ఇంత వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధిక వర్షాల కారణంగా ఈ సంవత్సరం ఖరీప్ పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోయారు. దీంతో యాసంగిలో జొన్న, మొక్కజొన్న పంటలను వేశారు. పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. చాలా వరకు రైతులు పంటలను కోసం అమ్మడానికి సిద్ధంగా ఉంచారు. జొన్నను ఆహారపు అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకని మంచి డిమాండ్ కూడా ఉంది. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో రబీలో జొన్న అధిక విస్తీర్ణంలో సాగువుతుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో కూడా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తుంటారు. గత సంవత్సరం సుమారు 42 వేల ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సంవత్సరం 58 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గత సంవత్సరం ప్రభుత్వం రూ.3,371 మద్దతు ధర ప్రకటించించగా.. ఈ ఏడాది క్వింటాలుకు రూ.3,664 నిర్దేశించింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. డబ్బుల అవసరం ఉన్న రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తే గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులు స్పందించి వెంటనే జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని మార్కెఫెడ్ అధికారులు పేర్కొనడం గమనార్హం.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి
సంగారెడ్డి టౌన్: జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 90 వేల ఎకరాలలో జొన్న పంట పండించారని, అయితే.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శనగలు కూడా కొనుగోలు చేయాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.


