మనసున్న మాణయ్య | - | Sakshi
Sakshi News home page

మనసున్న మాణయ్య

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

● 29 ఏళ్లుగా అంబలి దాత ● రోజుకు 100 లీటర్ల పంపిణీ ● వేసవిలో ప్రజలకు చల్లని ఉపశమనం

● 29 ఏళ్లుగా అంబలి దాత ● రోజుకు 100 లీటర్ల పంపిణీ ● వేసవిలో ప్రజలకు చల్లని ఉపశమనం

జోగిపేట(అందోల్‌): అసలే వేసవి.. బయటకు వెళితే చాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. దాహంతో అలమటిస్తూ.. గ్లాస్‌ నీరు దొరికితే చాలు కాస్తంత ఉపశమనం పొందుతారు. అయితే.. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన మాణయ్య.. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు తన వంతు సేవ చేయాలనే దృక్పథంతో అంబలి కేంద్రం నడుపుతారు. ఇలా 29 ఏళ్లుగా దీన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు సుమారు వంద లీటర్ల అంబలిని తయారు చేయగా.. 300 మంది వరకు దీనిని సేవిస్తున్నారు. కూలీలు, కార్మికులు, ప్రయాణికులు, పేద ప్రజలు మాత్రమే కాకుండా కొందరు తమ ఇళ్లకు కూడా తీసుకెళుతారు. మండల పరిధిలోని అన్నాసాగర్‌, రాంసానిపల్లి, నేరడిగుంట, ఎర్రారం, చింతకుంట గ్రామాలకు వెళ్లే ప్రజలు అంబలి కేంద్రానికి వచ్చి సేవిస్తుంటారు. మాణయ్య అందించే అంబలి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుండటంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వెల్డింగ్‌ వృత్తిని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆయన.. తన సంపాదనలో కొంత భాగాన్ని ఇలా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం రెండు మాసాల పాటు పంపిణీ చేసే అంబలికి గాను రూ.లక్షకు పైగానే ఖర్చు అవుతుందని అంచనా. పట్టణంలో జరిగే పలు సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

సేవ చేయడంలోనే ఆనందం

సేవ చేయడం ద్వారా నాకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను అని మాణయ్య ‘సాక్షి’కి తెలిపారు. 29 ఏళ్లుగా తాను ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని, తనకు శక్తి ఉన్నన్ని రోజులు ఈ కేంద్రాన్ని కొనసాగిస్తానన్నారు. ఆయన సేవలకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం నిజంగా గర్వకారణమని పట్టణ ప్రజలు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement