అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్‌

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

● పిస్తల్‌, ఎయిర్‌ గన్‌, రెండు కత్తులు, రూ. 2 లక్షలు స్వాధీనం ● ఒక రాష్ట్రంలో దొంగతనం.. మరొక రాష్ట్రంలో విక్రయం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

● పిస్తల్‌, ఎయిర్‌ గన్‌, రెండు కత్తులు, రూ. 2 లక్షలు స్వాధీనం ● ఒక రాష్ట్రంలో దొంగతనం.. మరొక రాష్ట్రంలో విక్రయం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

సంగారెడ్డి జోన్‌: ఒక రాష్ట్రంలో వాహనాలు దొంగిలించి, మరొక రాష్ట్రంలో అమ్ముతూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన మహమ్మద్‌ ఖుర్షీద్‌ అహ్మద్‌, జాఫర్‌ అలీ, నదీమ్‌ ఖాన్‌, షేక్‌ ఐజాజ్‌, సయ్యద్‌ సయీద్‌, షేక్‌ నిజాం, మహమ్మద్‌ సలీం, ఇర్షాద్‌ అహ్మద్‌, గులాం రబ్బానీ, సలావుద్దీన్‌, బాబా, మొహ్సిన్‌ షా, రేహాన్‌లు కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో దొంగతనాలు చేశారు. చోరీ చేసిన వాహనాలను స్క్రాప్‌ చేసి ఇంజిన్‌ భాగాలు ఒకరికి, మిగతా భాగాలు ఇతరులకు అమ్ముతూ పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా నేరాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 5, కర్ణాటక 1, మహారాష్ట్రలో ఐదు వాహన దొంగతనాల కేసులు నమోదైనట్లు వివరించారు.

డీసీఎం వాహనం చోరీ ఫిర్యాదుతో....

నారాయణఖేడ్‌లోని మనూర్‌ చౌరస్తాలో గత నెల 9న మధ్యాహ్న సమయంలో డ్రైవర్‌ సునీల్‌కుమార్‌ పార్కు చేసి వెళ్లాడు. మరుసటి రోజు రాత్రి 9గంటలకు వాహనం కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. దీంతో వాహన యజమాని నాగిల్‌గిద్దకు చెందిన మాలిపటేల్‌ దత్తు గత నెల 11న వాహనం పోయినట్లు నారాయణఖేడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీసీఎస్‌ సీఐ శివకుమార్‌, నారాయణఖేడ్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, దర్యాప్తు చేశారు. ఈ నెల 3న పట్టణంలోని పంచగామ కమాన్‌ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఖుర్షీద్‌, జాఫర్‌ అలీని అదుపులోకి తీసుకుని విచారించారు. సాంకేతికల ఆధారంగా దొంగల ముఠా గుట్టురట్టు అయ్యింది. వీరితో పాటు సయ్యద్‌ సయిద్‌, షేక్‌ నిజాం, సలీం, ఇర్షాద్‌ అహ్మద్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక పిస్టల్‌ (రెండు రౌండ్స్‌), ఒక ఎయిర్‌ గన్‌, రెండు కత్తులు, రూ.2లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు, టిప్పర్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతా వారు పరారీలో ఉన్నట్లు, వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, ప్రసాద్‌రావు, నారాయణఖేడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement