మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్‌ | - | Sakshi
Sakshi News home page

మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్‌

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

నర్సాపూర్‌: ఆర్టీసీ డ్రైవర్‌ మద్యం తాగి బస్సు నడిపాడు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు టెస్ట్‌ చేసి విధుల నుంచి తప్పించారు. మేడ్చల్‌ డిపోకు చెందిన హైర్‌ బస్సు డ్రైవర్‌ తిరుమలేశ్‌ సోమవారం మేడ్చల్‌ నుంచి నర్సాపూర్‌ డ్యూటీ చేస్తున్నాడు. మార్గమధ్యలో ప్రయాణికులతో దురుసుగా వ్యవహరించడంతో పాటు అతడి కదలికలు ప్రయాణికులకు అనుమానాలు కలిగించాయి. బస్సు నర్సాపూర్‌ రాగానే కొందరు ప్రయాణికులు 100కు ఫోన్‌ చేసి డ్రైవర్‌పై ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ సుందర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసులు బస్టాండ్‌కు వెళ్లి డ్రైవర్‌కు టెస్ట్‌ చేయగా, మద్యం తాగినట్లు తేలింది. డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చి విధుల నుంచి తప్పించారు. కాగా మేడ్చల్‌ డిపో అధికారులు మరో డ్రైవర్‌ను నర్సాపూర్‌కు పంపి బస్సును డిపోకు తీసుకువెళ్లారు.

మహిళ అదృశ్యం

జహీరాబాద్‌ టౌన్‌: వివాహిత మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మొగుడంపల్లి మండలం మిర్జంపల్లి తండాలో చోటుచేసుకుంది. చిరాగ్‌పల్లి ఎస్‌ఐ.రాజేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్జంపల్లి తండాకు చెందిన రేఖాబాయి(40) మానసిక పరిస్థితి బాగాలేదు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఏప్రిల్‌ 27న భర్త పాండు మందుల కోసం హైదరాబాద్‌కు వెళ్లగా.. రేఖాబాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే రోజు సాయంత్రం భర్త ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె కనపించలేదు. ఆమె కోసం బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు, భర్త ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: డీఎస్పీ

నర్సాపూర్‌: చట్టాలను ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ హితవు పలికారు. సోమవారం స్థానిక రైతు వేదికలో పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన పీస్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీ వద్ద సమాచారం పోలీసులకు చెప్పాలని, తమ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని సూచించారు. సమావేశంలో సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్‌ జనార్దన్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, కమిషనర్‌ సాయికుమార్‌ పాల్గొన్నారు.

బాలికపై అత్యాచారం .. ఇరవై ఏళ్ల జైలు

సదాశివపేట(సంగారెడ్డి): బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మేథారి శాంసన్‌కు ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ .8000 జరిమాన విధించారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్‌. శ్రీలేఖ తీర్పు చెప్పారని సీఐ వెంకటేశ్‌ తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాలికపై కేసు నమోదైంది. మేథారి శాంసన్‌కు శిక్షపడేలా కృషి చేసిన అధికారులకు ఎస్పీ పరితోష్‌పంకజ్‌ అభినందించారు. మేథారి శాంసన్‌ కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లాలోని రాజగిరా గ్రామానికి చెందిన శాంసన్‌ ఎలక్ట్రీషియన్‌ సెంట్రింగ్‌ పనులు చేసేవాడని తెలిపారు. నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా వాదించిన పీపీ సూర్యారెడ్డి, దర్యాప్తు అధికారి నవీన్‌కుమార్‌, ప్రస్తుత సీఐ వెంకటేశ్‌ పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement