కౌలు రైతుల పరిస్థితిమరీ ఘోరం
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
అరటి పంట రైతుకు నష్టాల చేదును తినిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం అరటి రైతుల పాలిట శాపంగా పరిణమించింది. ఎక్కడికక్కడ ఎగుమతులు ఆగిపోయి అరటి ధర దారుణంగా పడిపోవడంతో పంటను కొనే నాథుడే కరువయ్యాడు. దీంతో ఆ పంట రైతులు పొలాలను దున్నేసి మరో పంటసాగు వైపు మళ్లుతున్నారు. జహీరాబాద్ టౌన్:
అరటికి అన్నీ సీజన్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. లాభాలు వస్తాయన్న ఆశతో రైతులు పంట సాగు చేయగా గతంలో ఎన్నడూలేని విధంగా ధరలు పడిపోయాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసినా...కోతకు వచ్చే సరికి ధరలు పతనమయ్యాయి. రూ.వేల పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. పండించిన పంటకు మద్దతుధర లేకపోగా కొనేవారు కరువయ్యారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అరటి ధరలు ఒక్కసారిగా పతనమైనట్లు తెలుస్తోంది. సొంత పొలం ఉన్న వారికే నష్టాలు వస్తుంటే..ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అరటి కొనేవారు దొరకక గెలలు చెట్లమీదే పండుకు వస్తున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి చేతికిరాక విలవిల్లాడుతున్నారు.
సాగుకు అనుకూలమైన వాతావరణం
జిల్లాలో అరటికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నల్ల, ఎర్రటి నేలలు పంట సాగుకు అనుకూలం కావడంతో జహీరాబాద్, కోహీర్, రాయికోడ్, ఝరాసంగం, న్యాల్‌కల్, గుమ్మడిదల, కొండాపూర్ తదితర మండలాల్లో రైతులు అరటి సాగు చేశారు. జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో అరటి పంట ఉండగా ఒక్క జహీరాబాద్ డివిజన్‌లోనే సుమారు 500 ఎకరాల్లో పంట సాగవుతోంది. మేలైన రకాలు టిష్యూకల్చర్ మొక్కలను నాటడంతో పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎకరానికి 20 నుంచి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
కోతకు వచ్చే సరికి ధరలు పతనం
అరటి కోతకు వచ్చే సరికి ధరలు పతనమవడం ప్రారంభమైంది. నవంబర్ నెల నుంచి ధరలు పడిపోగా రంజాన్ మాసంలో పర్వాలేదనిపించింది. నెల రోజుల నుంచి మళ్లీ ధరలు పూర్తిగా పడిపోయాయి. రంజాన్ నెలలో టన్నుకు రూ.15 వేలం నుంచి 18 వేలు ధర పలుకగా ఇప్పుడు ఒక్కసారిగా టన్ను రూ.3 వేలకు పడిపోయింది. మహారాష్ట్రలో ఈసారి పంట సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని, అమెరికా–ఇరాన్– ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం మొదలై గల్ఫ్ దేశాలకు విస్తరించడంతో అరటి ఎగుమతులు ఆగిపోయినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో మార్కెట్‌కు పంట పెద్ద ఎత్తున మార్కెట్‌కు రావడంతో ఎగుమతులు తగ్గిపోయి ధరలు పడిపోయాయి. గతంలో వ్యాపారులు పొలం వద్దకు వచ్చి గెలల కోసం ముందే అడ్వాన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి తిరగబడి రైతులే వ్యాపారుల వద్దకు వెళ్లి అరటి పంటను కొనాలని కోరుకుంటున్నారు. మరికొంతమంది రైతులు అరటిపంటను కొనేవారు లేకపోవడంతో పంటను దున్నేస్తుండటం కలచి వేస్తోంది.
రూ.3 లక్షల నష్టం
బూచినెల్లి గ్రామ శివారులో భూమి కౌలుకు తీసుకుని రెండెకరాల్లో అరటి సాగు చేశా. కౌలుతో పాటు పంట సాగు కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశా. పంట కోతకు వచ్చే సమయానికి ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. కొనేవారు లేక పంటను దున్నేశా. దీంతో తనకు రూ.3 లక్షల నష్టం వచ్చింది. అదే బహిరంగ మార్కెట్‌లో మాత్రం వ్యాపారులు డజను రూ.60 చొప్పున అమ్ముతున్నారు. ప్రభుత్వాలు స్పందించి అరటికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
– నాగేశ్వర్‌రావు, కౌలు రైతు,బూచినెల్లి


