కేరళ నుంచి తెచ్చుకుంటున్న విత్తనం పెరగనున్న సాగు విస్తీర్ణం!
జహీరాబాద్: రెండేళ్లుగా అల్లం సాగుపట్ల విముఖంగా ఉన్న రైతులు తిరిగి పంట వేసేందుకు పట్ల ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో ధర పెరుగుతుండటమే కారణంగా తెలుస్తోంది. దీంతో జహీరాబాద్ ప్రాతంలో పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. గత రెండేళ్ల కాలంగా మార్కెట్లో ధరలు లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టాలను చవి చూశారు. క్వింటాల్ ధర రూ.2వేలు మాత్రమే పలికింది. దీంతో పెట్టుబడులు కూడా రాకపోవడంతో సాగు పట్ల నిరాసక్తత చూపుతూ వచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో ధర పెరగడంతో భవిష్యత్తులో కూడా ఇదే ధర ఉండే అవకాశం ఉందనే అంచనాతో రైతులు అల్లం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ధర రూ.4వేల నుంచి రూ.4,500 ధర పలుకుతోందని రైతులు పేర్కొంటున్నారు. ఇంతమేర ధర ఉంటే ఎంతో కొంత గిట్టుబాటవుతుందని నమ్మకంగా చెబుతున్నారు.
ఎనిమిది నెలల నుంచి...
ఎనిమిది నెలల నుంచి క్రమంగా అల్లం ధర పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. మే నుంచి జూన్ నెలాఖరు వరకు రైతులు అల్లం పంటను సాగు చేసుకుంటారు. ప్రస్తుతం పంట సాగు కోసం భూములను చదును చేసి, సేంద్రీయ ఎరువులను చల్లి భూములను సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది జిల్లాలో కేవలం 500 ఎకరాల్లో పంట సాగు కాగా, ఈ ఏడాది మాత్రం ఇది 2వేల ఎకరాలకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
కేరళ నుంచి విత్తనం కొనుగోలు
రైతులు కేరళ రాష్ట్రం నుంచి అల్లం విత్తనం కొనుగోలు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి తీసుకువచ్చే విత్తనం నాణ్యంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. కేరళ నుంచి తీసుకువస్తున్న విత్తనం క్వింటాల్ ధర రూ.7,500లకు కొనుగోలు చేసుకుంటున్నట్లు వారు వివరిస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతానికి ఇప్పటికే కేరళ నుంచి 500 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులు దిగుమతి చేసుకున్నారు. పలువురు రైతులు మాత్రం స్థానికంగా సాగులో ఉన్న పంటలోని కేరళ రకం విత్తనాన్ని సేకరించుకుని విత్తనం కోసం నిల్వపెట్టుకుంటున్నారు.
ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చని
అల్లం పంటను సాగు చేసుకుంటే రెండేళ్ల వరకు పంటను అమ్ముకునే వీలుంటుంది. మార్కెట్లో ధర లేనప్పుడు నీటి తడులు ఇవ్వడం ద్వారా పంట భూమిలోనే నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్న పంటకు తిరిగి మొలకలు వచ్చి పంట విస్తరించి దిగుబడులు రెట్టింపవుతాయి. దీంతో ధర ఉన్నప్పుడు పంటను అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో అల్లం పంటను సాగు చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
ధర పెరుగుదలతోరైతుల్లో ఆశలు
ప్రభుత్వం ప్రోత్సాహం
అల్లం పంటను వేసుకుంటున్న రైతులకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తున్నాం. విత్తనం కోసం కొంతమేర సబ్సిడీ ఇస్తున్నాం. రైతులు విత్తనం బిల్లులు భద్రంగా పెట్టుకుని దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి మంజూరు రాగానే సబ్సిడీ అందజేస్తాం.
– సోమేశ్వరరావు,
జిల్లా ఉద్యాన వన అధికారి, సంగారెడ్డి


