పారిశుద్ధ్యం పక్కదారి | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం పక్కదారి

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

సంగారెడ్డి జోన్‌: జాతీయ రహదారితోపాటు ప్రధాన రహదారుల వెంట ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. రోడ్లకిరువైపులా చెత్తను వేస్తుండటంతో ఆ ప్రదేశాలు డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తున్నాయి. ఫలితంగా ఆహ్లాదంగా సాగాల్సిన ప్రయాణాలు దుర్గంధాల మధ్య ప్రజలు తమ రాకపోకలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పారిశుద్ధ్య సిబ్బందిగానీ, అధికారులు గానీ అటుగా కన్నెత్తి చూడటంలేదు.

రహదారుల పక్కనే చెత్త డంపింగ్‌

పట్టణంలోని వివిధ వ్యాపార సంస్థల నిర్వాహకులు చెత్తను తీసుకొచ్చి రహదారుల పక్కనే డంపింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా హైదరాబాద్‌ నుంచి ముంబై జాతీయ రహదారి ఉంది. పటాన్‌చెరు నుంచి జహీరాబాద్‌ వరకు జిల్లా సరిహద్దు ఉంటుంది. సంగారెడ్డి, సదాశివపేట, కోహీర్‌, జహీరాబాద్‌ పట్టణ శివారులో ఉన్న జాతీయ రహదారి పక్కన ప్లాస్టిక్‌ కవర్లు, వ్యర్ధాలు, చెత్తను ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. బలమైన గాలులు వీచిన సమయంలో డివైడర్‌ మధ్యలో ఉన్న మొక్కల మధ్య పాలిథిన్‌ కవర్లు నిండిపోతున్నాయి. అదేవిధంగా చెత్తకుప్పలకు నిప్పు పెట్టడంతో వచ్చే పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భరించలేని దుర్వాసన

సంగారెడ్డి, సదాశివపేట పరిధిలో ఉన్న జాతీయ రహదారి పక్కన కూలిన కూరగాయలు, వివిధ రకాల పండ్లు, ఇతర వ్యర్ధాలు పడేస్తున్నారు. వాటిని తొలగించకపోవడంతో భరించలేనిస్థాయిలో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్తను తొలగించే పనులు చేయించాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

రహదారి నిర్వహణపై కలెక్టర్‌ అసంతృప్తి

జిల్లాలో ఉన్న రహదారుల నిర్వహణపై కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదాల నివారణపై ఇటీవల సమీక్ష నిర్వహించి జాతీయ రహదారితోపాటు ప్రధాన రహదారుల ఇరువైపున చెత్తను తొలగించాలని ఆదేశించారు. అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినా ఆయన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుండటం పారిశుద్ధ్య సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పటికై నా చెత్తను తొలగించి రహదారుల నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

జాతీయ రహదారి పక్కనేచెత్తకుప్పలు

డంపింగ్‌ చేస్తున్నా పట్టించుకోనిఅధికారులు

Advertisement
 
Advertisement
Advertisement