డివిజన్‌ కేంద్రాల్లోనూ ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

డివిజన్‌ కేంద్రాల్లోనూ ప్రజావాణి

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ఇప్పటివరకు జిల్లాస్థాయిలోనే కొనసాగిస్తుండగా తాజాగా ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్‌స్థాయిలోనూ నిర్వహించేందుకు నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌ వరకు రాకుండానే రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజావాణిని నిర్వహించాలన్న నిర్ణయం పట్ల ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

– నారాయణఖేడ్‌:

ప్రజావాణి కార్యక్రమం జిల్లా స్థాయిలో కలెక్టర్‌, రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో నారాయణఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, జహీరాబాద్‌, సంగారెడ్డి, ఆందోల్‌ రెవెన్యూ డివిజన్‌లలో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభం కానుంది.

నోడల్‌ అధికారిగా ఆర్డీవో

జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తూ ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండటం తెలిసిందే. కలెక్టర్‌తోపాటు జిల్లా స్థాయి అధికారులు కూడా పాల్గొంటారు. ఆయా శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా విభజిస్తూ పరిష్కారానికి పంపిస్తుంటారు. ఇక రెవెన్యూ డివిజన్‌స్థాయిలో సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ ప్రజావాణికి డివిజన్‌ పరిధిలోని అన్ని శాఖల డివిజన్‌స్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను స్వీకరించి 30 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి. లేదంటే తిరస్కరణ, పెండింగ్‌కు సంబంధించిన స్పష్టతను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. స్వీకరించిన దరఖాస్తులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి దరఖాస్తుదారుకు రశీదు అందజేస్తారు. దరఖాస్తు పరిస్థితిని ప్రజావాణి పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

త్వరలో మండల స్థాయిలో

ఇదే విధానం త్వరలో మండల స్థాయిలోనూ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లా, రెవెన్యూ డివిజన్‌స్థాయిలో కొనసాగిన విధంగానే మండల స్థాయి అధికారులు నిర్వహిస్తారు. దీంతో ప్రజలు క్షేత్రస్థాయిలోనే తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కలగనుంది. అలా కాని పక్షంలో డివిజన్‌, జిల్లా స్థాయికి వెళ్లే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement