నేడే నీట్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే నీట్‌

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

సంగారెడ్డి క్రైమ్‌: జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్‌ –2026 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు బీఎన్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమల్లో ఉంటుందని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్‌ తెలిపారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా సంచరించవద్దని, పరీక్ష కేంద్రాల 100 మీటర్ల సమీపంలోని జిరాక్స్‌ షాపులు, స్టేషనరీలు తదితర దుకాణలు మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఖేడ్‌ కమిషనర్‌గా

ప్రశాంతి బాధ్యతల స్వీకరణ

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా వి.ప్రశాంతి శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్‌గా ఉన్న జగ్జీవన్‌ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు.

అర్హులందరికీ

సంక్షేమ పథకాలు

టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి

సంగారెడ్డి: అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.195.18 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో జ్యోతి, ఆర్డీఓ రాజేందర్‌, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు కూన వనిత, అంజమ్మ, మున్సిపల్‌ కౌన్సిలర్లు ,సీడీసీ చైర్మన్‌ రామ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామచంద్రనాయక్‌, మున్సిపల్‌ కమిషనర్లు శ్రీనివాస్‌ రెడ్డి, శివాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

దళారులను నమ్మి

మోసపోవద్దు

మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కొప్పుల లక్ష్మి

వట్‌పల్లి(అందోల్‌): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించే సమయంలో దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి గిట్టుబాటు ధరను పొందాలని వట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కొప్పుల లక్ష్మి సూచించారు. మండల పరిధిలోని బిజిలీపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి ధ్యాన్యపు గింజను కొనుగోలు చేస్తుందన్నారు. క్వింటాలుకు వరి ధన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధరను చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంగప్ప, సీసీలు జనార్ధన్‌, నిరంజన్‌, మాణెమ్మ, నాయకులు నర్సింహులు, సదానందంతోపాటు తదితరులు పాల్గొన్నారు.

బ్యూటీ పార్లర్‌లో

మహిళలకు ఉచిత శిక్షణ

సంగారెడ్డి టౌన్‌: గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్‌లో ఈ 11వ తేదీ నుంచి 35 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ రాజేశ్‌ కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం కల్పించనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లా చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 9490103390 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement