తెల్లాపూర్ సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రి వివేక్
రామచంద్రాపురం(పటాన్ చెరు): ముఖ్యమంత్రి కావాలన్న ఆశ తనకెప్పుడూ లేదని, జీవితంలో ఒక్కరోజైనా మంత్రి కావాలని అనుకున్నానని మంత్రి వివేక్ అన్నారు. తెల్లాపూర్ పరిధిలో ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు కొల్లూరి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల ఆర్థికాభివృద్ధికి ప్రతీ ఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు. తన వంతుగా విశాఖ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నానని వెల్లడించారు. నిరుపేద యువతకు వివిధ క్రీడల్లో ఉచిత శిక్షణను అందించాలన్న లక్ష్యంతో కొల్లూరి సత్తయ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడం, ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి దేశంలోని నిరుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ తదితర అంశాలపై ఉచితంగా వసతి కల్పించి శిక్షణ ఇవ్వడం హర్షణీయమన్నారు. జర్మనీలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడి యువతకు జర్మన్ భాషపై పట్టు సాధించే విధంగా శిక్షణ అందించాలని కోరారు. కొల్లూరు సత్తయ్య మాట్లాడుతూ తమ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిరుపేదల విద్యార్థులకు ఉచితంగా వివిధ ఆటల్లో శిక్షణ అందించి క్రీడల్లో రాణించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కె.వి.రాజా, మాజీ కౌన్సిలర్ భరత్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బాలయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


