రూ.2.50 లక్షలు నష్టం
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట కాలిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని టేకూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సిరూర్ ఈరన్న ఐదెకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. కోత కోసిన పంటను రాసి చేసేందుకు ఒక దగ్గర కుప్పగా పోశాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి కుప్పగా పోసిన మొక్క జొన్నకు నిప్పంటుకుంది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పంట పూర్తిగా కాలిపోయింది. మొక్క జొన్నతో పాటు పొలంలో ఉన్న డ్రిప్ పైపులు కూడా కాలిపోయాయి. దీంతో రూ.2.50 లక్షలు నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశాడు.


