ప్లాస్టిక్‌ పూలపై నిషేధం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ పూలపై నిషేధం

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

అమ్మకాలు జరిపితే

జరిమానాతోపాటు లైసెన్స్‌ రద్దు

సహజ పూల సాగుకే ప్రోత్సాహం

300 వందల ఎకరాల్లో విస్తీర్ణంలో సాగు

కాలుష్యాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం

సంగారెడ్డి జోన్‌: పర్యావరణ పరిరక్షణ, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్కెట్లు, రైతు బజార్లలో ప్లాస్టిక్‌ పూల విక్రయాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తక్కువ ధర, ఎక్కువ కాలంపాటు ఆకర్షణీయంగా కనిపించడంతో ప్లాస్టిక్‌ పూల వినియోగం పెరిగింది. ఫలితంగా సహజపూలకు డిమాండ్‌ తగ్గడంతోపాటు విపరీతమైన కాలుష్యం పెరిగిపోతుంది.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలే

మార్కెటింగ్‌ శాఖ ఏప్రిల్‌లో పూల విక్రయాలను నిషేధించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ పూలను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్‌ పూలు విక్రయిస్తే సంబంధిత దుకాణదారుడుకి జరిమానా విధించడంతోపాటు లైసెన్స్‌ రద్దు చేయనున్నట్లు పేర్కొంది.

సహజ పూలసాగుకు ప్రోత్సాహం

ప్లాస్టిక్‌ వల్ల సహజంగా పూలు సాగు చేసే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మార్కెట్లో అమ్మకాలు తక్కువగా ఉండటంతో కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పడిపోతుంది. అయితే పూల సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధంతోపాటు పర్యావరణహితమైన పూల సాగుకు ప్రోత్సాహకరంగా సబ్సిడీలను అందజేస్తోంది. గతేడాది జిల్లాలో 200 ఎకరాల విస్తీర్ణంలో పూలు సాగు చేసిన రైతులకు ప్రోత్సాహకాలను అందించింది.

నిషేధం అమలయ్యేనా?

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించవద్దంటూ నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్లాస్టిక్‌ వినియోగం పెరగటం, నిషేధం అమలు కాగితాలకే పరిమితమైపోవడంతో అనుకున్న లక్ష్యం కాస్తా నీరుగారిపోయింది. పూల విక్రయాల నిషేధం కఠినంగా అమలు చేసి, సహజంగా పూలు సాగుచేసిన రైతులకు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement